సిద్దిపేట అర్బన్, మార్చి 1: యాసంగిలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్లో కోరారు. సిద్దిపేట నియోజకవర్గంలో పంట పొలాలకు సాగునీళ్లు అందక ఎండిపోతున్నాయని, మిడ్ మానేర్ నుంచి రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోయాలని కోరారు. నియోజకవర్గంలో గత నాలుగేండ్ల నుంచి యాసంగి పంటలకు రంగనాయకసాగర్ కాల్వల ద్వారా నీటిని అందించామని, ఈసారి కూడా సాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.
రంగనాయక సాగర్ కింద పంటల సాగు పెరిగిందని, ఈసారి 50 వేల ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. రంగనాయకసాగర్‌లో ఇటీవల 2.4 టీఎంసీల నీళ్లు పంపింగ్ చేశారని, ప్రస్తుతం రంగనాయకసాగర్‌లో 1.5 టీఎంసీల నీరు మాత్ర మే అందుబాటులో ఉందన్నారు. యాసం గి పంటకు పూర్తిస్థ్థాయిలో నీరందాలంటే ఇంకో టీఎంసీ నీళ్లు అవసరం ఉంటాయని, మిడ్‌మానేరు నుంచి పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంటలు కాపాడి రైతులను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు.