సిద్దిపేట అర్బన్, ఆగస్టు 22: రాజ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డి 157వ జయంతి నిర్వహించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రెడ్డి సంఘం నేడు ఇంత గొప్పగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. ఆయన హైదరాబాద్ కోత్వాల్‌గా ఉన్న కాలంలోనే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లల కోసం రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. గతంలో హైదరాబాద్‌లో కూడా ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం దక్కిందన్నారు. రాజ్‌బహదూర్ ఆశయాల వల్ల చదువుకొని ప్రయోజకుడైన డాక్టర్ చంద్రారెడ్డి నేడు సిద్దిపేటలో లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు.సిద్దిపేటలో కూడా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ లేదా స్కూల్ కట్టాలనే ప్రతిపాదనలు తెచ్చారన్నారు.కమిటీ సభ్యులంతా కూర్చొని ఏది అవసరమో నిర్ణయించి దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
2012-13 ప్రాంతంలోనే రెడ్డి భవన నిర్మాణం ప్రా రంభించామన్నారు. సిద్దిపేటలోనే ఇది మొట్టమొదటి ఏసీ ఫంక్షన్ హాల్, వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలకు కాకుం డా కేవలం పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాలని సూ చించారు. ఆ నిధుల్లో 50 శాతం రెడ్డి సామాజిక వర్గంలోని పేదలకు, మిగతా 50 శాతం ఇతర వర్గాల్లోని పేద పిల్లలకు కేటాయించాలన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాష్కరణలో భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వెంకట్రామిరెడ్డి నిజాం నవాబు మన్ననలు పొంది ఆ రోజుల్లో పోలీస్ కమిషనర్ కావడం మామూలు విషయం కాదన్నారు. ఆ రోజుల్లోనే నిజాం నవాబును ఒప్పించి హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ నిర్మించారన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కూడా రెడ్డి హాస్టల్లో ఉండి చదువుకున్నారన్నారు.
సిద్దిపేటకు హరీశ్‌రావు లాంటి నాయకుడు దొరకడం అదృష్టమన్నారు. అధికారంలో లేని రోజు ఎకరం భూమి రెడ్డి సంఘానికి ఇవ్వడం మామూ లు విషయం కాదన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కులసంఘాలకు భవనాలు ఉండాలని నిర్మించారన్నారు. కేసీఆర్ హయాంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్బీఆర్ సంఘానికి ఇచ్చారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్‌బహదూర్ వెంకట్రామిరెడ్డి అంటే తెలంగాణలో తెలియనివారు ఉండరన్నారు. రెడ్డి సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుంటాయన్నారు. రాజ్‌బహదూర్ ఆశయాల కోసం పాటుపడతామన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు, రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.