సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 19 : విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని జీవిత పాఠాలు కూడా నేర్పించాలని నాడు మహాత్మాగాంధీ సూచించినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, మనం చదివిన పాఠశాలను ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్లో భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి అనే పేరుతో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు వేసవిలో పాటించాల్సిన కొన్ని ముఖ్య విషయాలపై వివరించారు.
తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి.. వారిని ఎలా గౌరవించాలి.. గురువులను ఎలా గౌరవించాలి తదితర అం శాలపై మోటివేషనల్ స్పీకర్ రంజిత్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంత ఎదిగితే ఉపాధ్యాయు లు అంత ఉప్పొంగుతారని, తమ కంటే తమ శిష్యలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడతారన్నారు. నేటి భద్రతనే రేపటి భవిష్యత్ ఎదుగుదల అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. వేసవి సెలవుల్లో చెరువులు, ప్రాజెక్ట్‌లు, కాలువల వద్ద ఈతకు వెళ్లవద్దని సూచించారు. చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఈతకు వెళ్లి చనిపోవడం ఈ మధ్య చాలా చూస్తున్నామన్నారు.
తల్లిదండ్రులకు చెప్పకుండా సైకిళ్లు, బైక్‌లు నడపవద్దని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇద్దరు చిన్నారులు కారులో ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయారని, ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. విలువైన ఈ వేసవి కాలాన్ని స్టేజీ ఫియర్‌ను అధిగమించడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్, మ్యూజిక్ లాంటివి నేర్చుకోవడం, తల్లిదండ్రుల పనుల్లో సాయం చేయడం వంటివి చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని హరీశ్‌రావు అభినందించారు. అనంతరం భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి కరపత్రాలను ఆయన ఆవిష్కరించి.. విద్యార్థులకు పలు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
విద్యార్థులకు ముందుగా రంజిత్ అనే మోటివేషనల్ స్పీకర్ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి.. ఎలా విలువ ఇవ్వాలి.. తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎందు కు వినాలి.. వంటి విషయాలు విద్యార్థులకు వివరించారు. ఇందులో భాగంగా కొందరు విద్యార్థులు తమ స్పందనను తెలియజేస్తూ ఇకపై తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టమని, వారిని గౌరవిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థిని సాత్విక మాట్లాడుతూ.. తాను రెండో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయాడని, తన అమ్మే అన్ని బాగోగులు చూసుకుంటుందని, ఈరోజు తాను చదువుకుంటున్నానంటే అమ్మ కష్టార్జితమని బోరున విలపించింది.
దీంతో మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టారు. దీంతో సభలో ఉన్నవాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సాత్వికను తన దగ్గరకు ఆత్మీయంగా పిలిపించుకొని హరీశ్‌రావు ఓదార్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మాజీ ఏఎంసీ చైర్మన్లు పాల సాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చిన్నా, వేణుగోపాల్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.