సిద్దిపేట, జనవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంగునూరు మండల యువజన విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేటలో పరుగులు పెట్టిన అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగిపోయిందన్నారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్దిపేట అభివృద్ధిపై అకసు వెళ్లగకుతూ,ఇకడి ప్రజలపై కక్ష సాధిస్తున్నదన్నారు.సిద్దిపేట అంటే గౌరవం వచ్చేలా అభివృద్ధి చేసి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిపామన్నారు.నాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన పనులను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసిందని, అనేక పనులను మధ్యలో ఆపి సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. రంగనాయక సాగర్ టూరిజం డెవలప్మెంట్, దవాఖాన, శిల్పారామం వంటి నిర్మాణ పనులు ఆపివేసినట్లు గుర్తుచేశారు.
కొత్తవి మంజూరు చేయకపోగా, పాత పనులన్నింటినీ ఆపడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ ఏడాది అభివృద్ధి పాలన అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ప్రజా ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. ఏడాదిగా కాంగ్రెస్ పాలనలో సిద్దిపేటకు చేసిన ఒక మంచి పని ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హరీశ్‌రావు ప్రశ్నించారు.
సిద్దిపేటలోని వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించుకుపోతే కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. సిద్దిపేట అభివృద్ధి పనులు జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని హరీశ్‌రావు పేర్కొన్నారు.
భవిష్యత్తు అంతా యువతదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి బాధ్యత యువతపై ఉందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు సొంత ప్రయోజనాలను మాని ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నంగునూరు మండలం ఎంతో అభివృద్ధి చెందిందని, నాలుగు వరుసల రహదారులు, విద్య, వైద్యం, అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించుకున్నట్లు తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువతకు సూచించారు.
యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి, కీలకంగా వ్యవహరించాలన్నారు. రాబోయే రోజుల్లో యువతకు సముచిత స్థానం ఇస్తామని,పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కోతలు తప్ప పురోగతి ఏమి లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు దేవుడెరుగు, పాత పథకాలను బంద్ చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండు భూపేశ్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నిమ్మ రజినీకాంత్ రెడ్డి, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.