రామచంద్రాపురం, మార్చి 15: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేయించిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించి కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
20 సంవ త్సరాలుగా పదవిలో ఉన్నా లేకపోయినా సోమిరెడ్డి ఇఫ్తార్ విందు ఇస్తూ ముస్లింలను గౌరవిస్తున్నారని అభినందించారు. కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, మైనార్టీల సంక్షేమాన్ని ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మత ఘర్షణలు జరుగుతున్నాయని, కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు సోదరులుగా కలిసి ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాలను ఇవ్వడం లేదన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీ నుంచి ఒక్క మంత్రి లేడని, మొన్నటి ఎమ్మెల్సీల్లో కూడా మైనార్టీలకు చోటు లేదని చెప్పారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నదని, కానీ.. ఈరోజు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తనకి మోదీకి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పేది కొండంత.. చేసేది గోరంత అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలను బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ఎండగడుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో తెల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.75కోట్లు మంజూరు చేస్తే, అందులో రూ.25కోట్లు పనులు జరిగాయని గుర్తుచేశారు. మిగతా రూ.50కోట్లు రేవంత్‌రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెల్లాపూర్ అవసరాల కోసం తమ హయాంలో రూ.500కోట్ల విలువైన భూమిని మంజూరు చేయిస్తే, అందులో రూ.10కోట్లతో మున్సిపల్ భవనం, రూ.10కోట్లతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించామని, పనులు జరిగినా ఫంక్షన్ హాల్ని ప్రారంభించడం లేదన్నారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణం నిలిచి పోవడంతో అందులో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని అన్నారు. సబ్‌స్టేషన్ కోసం భూమిని కేటాయిస్తే అందులో ఇప్పటి వరకు పనులు జరగడం లేదన్నారు.
రేవంత్‌రెడ్డి పాలనలో మాటలు తప్ప చేతలు శూన్యమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెల్లాపూర్‌కు పెండింగ్ నిధులు ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అంతకు ముందు తెల్లాపూర్‌లోని మున్సిపల్ భవనం, ఫంక్షన్ హాల్ని సందర్శించి విద్యుత్ నగర్లో సోమిరెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్లకు రైస్ బ్యాగ్‌లు అందజేశారు. అనంతరం కొల్లూర్ 2బీహెచ్‌కేలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్, కార్పొరేటర్ మెట్టుకుమార్, కార్మిక నాయకుడు ఎల్లయ్య, నాయకులు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, రాములుగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, అంజయ్య, బాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.