సిద్దిపేట, డిసెంబర్ 25: ఏసుప్రభు బోధనలు అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్తో కలిసి ఆయన పాల్గొని కేక్‌కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అద్భుతంగా పాటలు ఆలపించిన చిన్నారులకు నగదు బహుమతి అందజేశారు. లయన్స్ క్లబ్, అభయ జ్యోతి సంస్థల ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మా ట్లాడుతూ మనవులందరూ శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల జాలి, దయ కలిగి ఉండాలని ఏసుప్రభువు బోధించారన్నారు. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రైస్తవులందరికీ సంతోషమన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్ అన్నారు. దయాగుణం వల్లనే ఏసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు. క్రిస్మస్ సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగపూట అందరూ సంతోషంగా ఉండాలని పేద క్రైస్తవులకు పదేండ్లు క్రిస్మస్ కానుకలు అందించారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అందించడం లేదన్నారు. ఏసు ప్రభువు చెప్పిన విషయాలన్నీ మనం జీవితంలో ఆచరించాలన్నారు.అప్పుడే ఏసుప్రభు పట్ల మనం నిజమైనభక్తి చూపినవారమవుతామన్నారు. జక్కాపూర్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరామ్, మారుపల్లి శ్రీనివాస్ గౌడ్, క్రైస్తవ ప్రతినిధులు ప్రసాద్ రమేశ్, సత్యానందం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వినోద్ మోదాని, జోజి పాల్గొన్నారు.