హుస్నాబాద్‌టౌన్, అక్టోబర్ 15: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్‌రావు అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించారు. సిద్దిపేటలో స్టీల్బ్యాంకులు ఎంతగానో సక్సెస్ అయ్యాయి. వివిధ కార్యక్రమాలు, శుభకార్యాలల్లో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వాడడం స్టీల్బ్యాంకుల ఉద్దేశం. సిద్దిపేటను స్ఫూర్తిగా తీసుకుని హుస్నాబాద్ పట్టణంలోని 20 మహిళా సమాఖ్యలకు సెస్టెంబర్ 25న స్టీల్బ్యాంకులు ప్రారంభించారు. మహి ళా సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించేందుకు పొన్నం సత్తయ్య గౌడ్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ వస్తువులు అందజేశా రు.
హుస్నాబాద్ పట్టణంలో జరిగే వివిధ కార్యక్రమాలకు వీటిని మహిళా సమాఖ్యల ద్వారా అద్దెకు ఇవ్వనున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ స్టీల్ వస్తువులను ఎక్కడ పెట్టి నిర్వహించాలనేది మహిళా సంఘాలకు సమస్యగా మారింది. అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకును నిర్వహించేందుకు అనువైన ప్రభుత్వ గదులు లేవు. దీంతో కొన్ని మహిళా సమాఖ్యలు వారి ఇండ్లలోనే సామగ్రి ఉంచారు. స్టీల్‌బ్యాంకు కోసం ప్రత్యేకంగా ఒక గది ఉంటే తప్ప నిర్వహించలేమ ని, గదులను అద్దెకు తీసుకునే నిర్వహించే ఆర్థిక స్థితి తమకు లేదని మహిళా సమాఖ్య లు తెలుపుతున్నాయి. మంత్రి పొన్నం, అధికారులు స్పందించి దారిచూపాలని మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.