కంది, జూలై 28: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రాణాలు కోల్పోయి దుఃఖంలో ఉన్న తమను ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బాధితులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బాధితులతో కలిసి హరీశ్‌రావు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. చనిపోయిన వారిని గుర్తుచేసుకొని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. కొడుకు అస్థికలు కూడా దొరక లేదని, బుడిదతో కార్యక్రమాలు చేసుకున్నామంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. పరిహారం కోసం పదే పదే తమ వద్దకు రావద్దని సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బాధితులు పేర్కొన్నారు.