సిద్దిపేట, డిసెంబర్ 7: సిద్దిపేట నియోజకవర్గంలోని రామంచ గ్రామస్తులు ఐక్యతతో గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఏకగ్రీవ సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ గ్రామస్తులతో కలిసి సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు జీపీలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. నంగునూర్ మండలంలోని ఖాతా, సంతోష్‌నగర్, సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోని బండ, చిన్నకోడూరు మండలంలోని రామంచ ఏకగ్రీవమైనట్లు చెప్పారు.
రామంచ సర్పంచ్‌గా ఎర్ర భవానీనవీన్ ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఊరంతా ఒక్కతాటి మీదకు వచ్చి ఒకరూ పోటీలో ఉంటే చాలు, అందరం ఒకటే పార్టీ.. కేసీఆర్, హరీశ్‌రావు వైపు ఉండే గ్రామం రామంచ అని అన్నారు. 20 ఏండ్ల కిందట తాను మొదటి కొనుగోలు కేంద్రాన్ని రామంచలోనే ప్రారంభించినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.2 కోట్లతో గ్రామంలో నాగేశ్వర ఆలయం నుంచి సిరిసిల్లను కలిపే రోడ్డు వేసుకున్నట్లు తెలిపారు. రూ.2 కోట్లతో రామంచ నుంచి రంగనాయక స్వామి గుట్ట నుంచి చంద్లాపూర్ వరకు రోడ్డు మంజూరు చేసుకున్నామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రామంచలో మూడు చెరువులు, చంద్ల్లాపూర్లో మూడు చెరువులు, మాచాపూర్‌లో రెండు చెరువులు, మొత్తంగా 8 చెరువులు నింపే రంగనాయక లిఫ్ట్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
కొద్దిరోజుల్లోనే చెరువుల్లోకి నీళ్లు వస్తాయని, రామంచ గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, భవిష్యత్‌లో అద్భుతంగా చేసుకుందామని హరశ్రావు అన్నారు. అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హరీశ్‌రావు అభయం ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఎర్ర భవానీనవీన్ బాగా పనిచేసి గ్రామానికి సేవచేసి ఆదర్శం గా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి హరీశ్‌రావు అభినందించారు. గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.