సిద్దిపేట, ఏప్రిల్ 6: సీతారాముల ఆశీస్సులతో ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పలు ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేటలోని రామాయలంలో కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు.
లింగారెడ్డిపల్లిలో, సిద్దిపేట పారుపల్లి వీధిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, పుస్తెమట్టెలు సమర్పించారు. సిద్దిపేట రేణుకానగర్, పారుపల్లి వీధిలోని రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం, గంజి హనుమాన్ దేవాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో, సిద్దిపేట పట్టణం నాసర్‌పురా హనుమాన్ దేవాలయంలో, ప్రశాంత్‌నగర్, సుభాష్ నగర్, సంతోష్ నగర్, వడ్డెర కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్, లెక్చరర్ కాలనీలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాలకులు మంచి పాలన అందించేలా రాములవారు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు పాల సాయిరామ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.