హుస్నాబాద్, ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హాఫ్ మారథాన్ పోటీలు ఆదివారం ఉదయం ఉత్సాహంగా జరిగాయి. పోలీసుశాఖ, రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌తోపాటు 10కే రన్, 5కే రన్లకు అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వెయ్యి మందికిపైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొనడంతో హుస్నాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటలకు హాఫ్ మారథాన్ (21 కి.మీ పరుగు) పోటీని అడిషనల్ డీసీపీ మహేందర్, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్ ప్రారంభించారు. అనంతరం 10కే రన్, 5కే రన్లను ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రారంభించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ ఎర్రల కిరణ్, డివిజన్లోని ఎస్సైల ఆధ్వర్యంలో ఇబ్బం దులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కళాబృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రన్నింగ్, వాకింగ్ ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయని, ప్రతి ఒక్కరూ నిత్యం సాధన చేయాలనే సంకల్పంతో ఈ హాఫ్ మారథాన్, ఇతర పరుగు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఎక్కడా నిర్వహించని హాఫ్ మారథాన్‌ను హుస్నాబాద్ పట్టణంలో మూడుసార్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందుకు స్థానిక పోలీసు అధికారులు, రన్నర్స్ కృషి ఎంతో ఉందన్నారు. మున్ముందు ఇలాంటి పోటీలతో యువతలో చైతన్యాన్ని నింపాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు దేవారెడ్డి, ఫణీందర్, ఎస్బీ సీఐ రఘుపతిరెడ్డి, రన్నర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాపురెడ్డి, రమేశ్, బొడుమల్ల సంపత్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎండీ అన్వర్, ఆకుల వెంకట్, క్రాంతిరెడ్డి, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హాఫ్ మారథాన్‌లో పాల్గొన్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత విజయవంతంగా రన్‌ను పూర్తిచేసి మహిళల్లో స్ఫూర్తిని నింపారు. 10కే రన్లో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సతీమణి ప్రొఫెసర్ షమిత మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 21 కిలోమీటర్ల పరుగును పూర్తిచేసిన సీపీ శ్వేతకు మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేసి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు నాగభూషణ్‌రావు కూడా హాఫ్ మారథాన్ పూర్తి చేయడం విశేషం. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళలు నిత్యం వ్యాయామం, రన్నింగ్, వాకింగ్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులై అన్నిరంగాల్లో ముందుండాలని సూచించారు. మనుషులకు ఆరోగ్యం ఎంతో విలువైనదని, కాపాడుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ, స్థానిక మహిళా కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, వాల సుప్రజ, బోజు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే…
పురుషుల కేటగిరీలో ప్రథమ రమేశ్చంద్ర (నాగర్‌కర్నూల్)-రూ.25 వేల నగదు బహుమతి, ద్వితీయ బి.రమేశ్ (నల్గొండ)-రూ.15 వేలు, తృతీయ వేదవ్యాస్ (రాజమండ్రి)-రూ.10 వేలు, మహిళల కేటగిరీలో ప్రథమ వి.నవ్య (నల్గొండ)-రూ.25 వేలు, ద్వితీయ మహేశ్వరి (హైదరాబాద్)-రూ.15 వేలు, తృతీయ కామాక్షి (ఖమ్మం)-రూ.10 వేలు బహుమతులు అందుకున్నారు.
పురుషుల కేటగిరీలో ప్రథమ బహుమతి మంచికంటి లింగన్న (వరంగల్)-రూ.10 వేలు, ద్వితీయ రాథోడ్ అనిల్ (వరంగల్)-రూ.7 వేలు, తృతీయ కాట్రోతు అనిల్ (కామారెడ్డి)-రూ.5 వేలు, మహిళల కేటగిరీలో ప్రథమ బహుమతి మాలిపల్లి ఉమ (నల్గొండ)-రూ.15 వేలు, ద్వితీయ ఎండీ సమీరాబేగం (కరీంనగర్)-రూ.7 వేలు, తృతీయ పి.కుమారి (భద్రాచలం)-రూ.5 వేల నగదు సాధించారు.
పురుషుల కేటగిరీలో ప్రథమ బహుమతి రఫీ-రూ.7,500, ద్వితీయ అభిషేక్-రూ.5 వేలు, తృతీయ అనిల్-రూ.2,500, మహిళల కేటగిరీలో ప్రథమ ఎం.విశాలాక్షి (హైదరాబాద్)-రూ.7,500, ద్వితీయ డి.కల్యాణి (నల్గొండ)-రూ.5 వేలు, తృతీయ బి.హరిత (కామారెడ్డి)-రూ.2,500 బహుమతులు సాధించారు.