తెలంగాణలో ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు..సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం కానున్నది. దరఖాస్తులను ఆన్లైన్లో లేదా స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి నేరుగా సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ దగ్గరి నుంచి ఇండ్ల మంజూరు, బిల్లుల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తారు. అర్హుల జాబితాను చూసి మంత్రి హరీశ్‌రావు ఇండ్లు మంజూరు చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున 33,000 ఇండ్లు రానున్నాయి. ఇవి కాకుండా జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీ, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు ఉన్నాయి. ఇవి అన్ని కలుపుకుంటే సుమారు 35 వేల ఇండ్ల వరకు వస్తాయి.
సిద్దిపేట, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గూడులేని నిరు పేదలకు సీఎం కేసీఆర్ గూడు కట్టించి ఇచ్చారు. తాజాగా గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. గృహలక్ష్మి పథకానికి ఆన్లైన్లో త్వరలోనే దరఖాస్తులు స్వీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. తాజాగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది. సొంత జాగా ఉన్న వాళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం కానున్నది. ఆన్లైన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఇట్టి దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలో పరిశీలన చేసి అర్హులైన వారిని గుర్తిస్తారు. ఇలా గుర్తించిన అర్హుల జాబితాను జిల్లా మంత్రి హరీశ్‌రావు మంజూరు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కోఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం. ఇది పూర్తిగా సబ్సిడీ. లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన పని లేదు.
గృహలక్ష్మికి మార్గదర్శకాలు
గృహలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించగా ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది. సొంత జాగా ఉన్న వాళ్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఆన్లైన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలో పరిశీలించి అర్హులైన వారిని గుర్తిస్తారు. ఇలా గుర్తించిన అర్హుల జాబితాను జిల్లా మంత్రి హరీశ్‌రావు మంజూరు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కోఇంటికి రూ 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఇది పూర్తిగా సబ్సిడీ. లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, దివ్యాంగులకు 5శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతం తగ్గకుండా ప్రాధాన్యం కల్పిస్తారు. గతంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు, 59 జీవోతో లబ్ధి పొందినవారు ఈ పథకానికి అనర్హులు. గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యే ఇంటిని మహిళ పేరు మీద ఇస్తారు. లబ్ధిదారుడు స్థానిక వాస్తవ్యుడై ఉండాలి. లబ్ధిదారులు నిర్మించుకునే ఇండ్లను మండల స్థాయిలో మండల అధికారులు పర్యవేక్షణ చేస్తారు. నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేసి ఆ ఇంటి నిర్మాణ వివిధ దశల ఫొటోలను సేకరిస్తారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుడి ఇష్టం వచ్చిన డిజైన్‌లో నిర్మాణం చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో కనీసం రెండు గదులు, మరుగుదొడ్డి మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా బేస్మెట్, రూప్లేవల్, పూర్తిస్థాయి నిర్మాణం ఇలా అన్ని దశలో ఫొటోలను తీసుకుంటారు.నిర్మాణ పురోగతిని బట్టి మూడు దశలో బిల్లులు అందిస్తారు. లబ్ధిదారుల చేత ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తీయించి ఒక్కో దశకు రూ.లక్ష చొప్పున నేరుగా లబ్ధిదారుడి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
సొంత జాగా ఉంటే రూ. 3లక్షలు
రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ. మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఆర్థికసాయం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్దఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇప్పటికే ఇవ్వగా, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వాటిని అర్హులైన పేదలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన పట్టణాల్లో మోడల్ కాలనీలు నిర్మించారు. ఇలా చేసిన కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ భవనాలను తలపిస్తున్నాయి. తాగునీరు, మురుగు కాల్వలు, రహదారులు, విద్యుత్ దీపాలు, పార్కులు ఇలా సకల సౌలత్లు కల్పించి పేదలకు ఉచితంగా ఇచ్చారు. దేశంలోనే సిద్దిపేట కేసీఆర్ నగర్ ఆదర్శం అని చెప్పాలి. తాజాగా ఇల్లు కట్టుకుందామనుకునే వారికి సొంత జాగా ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున 33,000 ఇండ్లు రానున్నాయి. ఇవి గాకుండా జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీ, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొంటే సుమారు 35 వేల ఇండ్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో మరిన్ని ఇండ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.