సంగారెడ్డి, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో 2024లో తీవ్ర నేరాలు పెరగడం తో పాటు మాదకద్రవ్యాల రవాణా, గంజాయి సాగు, రవాణా కేసులు పెరిగాయని, వాటిపై కఠినంగా వ్యవహరించామని ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక నేరాల నివేదిక వివరాలను మీడియాకు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో నేర కేసులు 5శాతం మేర పెరిగినట్లు చెప్పారు. గతేడాది జిల్లాలో 7236 కేసులు నమోదు కాగా, ఈసారి 7563 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో తీవ్ర నేరాలు 32శాతం పెరిగినట్లు వివరించారు. గతేడాది జిల్లాలో 215 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 283 కేసులు నమోదైనట్లు తెలిపారు.
సాధారణ నేర కేసులు గతేడాది 7021 నమోదు కాగా, ప్రస్తుతం 7280 కేసులు నమోదైనట్లు చెప్పారు. సాధారణ కేసులు ఈసారి 4శాతం పెరిగినట్లు తెలిపారు. హత్య కేసు లు 4శాతం పెరిగినట్లు తెలిపారు. గతేడాది జిల్లా లో 53 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 55 కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాది ఆస్తికోసం 5 హత్యలు జరగగా, ఈసారి 10 కేసులు నమోదైనట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు, గంజా యి రవాణా కేసులు జిల్లాలో పెరిగినట్లు తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, గంజా యి సాగుకు సంబంధించి గతేడాది 11, ఈ ఏడా ది 34 కేసులు నమోదైనట్లు చెప్పారు.
గతేడాది 5 గంజాయి కేసులు , ఈసారి 26 కేసులు నమోదైనట్లు వివరించారు. హెరాయిన్, నల్లమందు కేసు లు 4, గంజాయి సాగు కేసులు 4 నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో 508.71 కేజీల గంజాయి, 14.03 కేజీల హెరాయిన్, హాష్ ఆయిల్, నల్లమందు సీజ్ చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా లో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. గతేడాది 323, ఈసారి 793 సైబ ర్ కేసులు నమోదైనట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు రూ.47.84 కోట్లు కోల్పోయినట్లు చెప్పారు.
సైబర్ నేరాల అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రూపేశ్ వివరించారు. ఇందుకోసం ప్రత్యేక విభా గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల చర్య తో సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5.90 కోట్లు హోల్డ్ చేశామన్నారు. వచ్చే ఏడాది మాదకద్రవ్యాలు, గంజాయి సాగు రవాణాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి మహిళలపై నేరాలు పెరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. లైంగికదాడి కేసు లు 31శాతం పెరిగినట్లు చెప్పారు. గతేడాది 100 లైంగికదాడి కేసులు నమోదు కాగా, ఈసారి 131 నమోదైనట్లు వివరించారు. మహిళల హత్యలకు సంబంధించి ఈఏడాది 17 కేసులు నమోదైనట్లు తెలిపారు.మహిళల కిడ్నాప్ కేసులు గతేడాది 39 నమోదు కాగా, ఈఏడాది 75 నమోదైనట్లు వివరించారు. వరకట్నం వేధింపులతో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో మహిళలపై నేరాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశం లో అదనపు ఎస్పీ ఏ.సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో గతేడాదితో పోలిస్తే కిడ్నాప్‌లు, దోపిడీ కేసుల సంఖ్య పెరిగినట్లు ఎస్పీ తెలిపారు. దోపిడీ కేసులు ఈసారి 112శాతం పెరిగినట్లు చెప్పారు. గతేడాది దోపిడీ కేసులు 17 నమోదు కాగా, ఈసారి 36 కేసులు నమోదైనట్లు వివరించారు. రాత్రిపూట చోరీలు ఈసారి 9శాతం పెరిగినట్లు చెప్పారు. గతేడాది రాత్రిపూట చోరీలు కేసులు 197 నమోదు కాగా, ప్రస్తుత సంవత్సరం 215 నమోదైనట్లు తెలిపారు. సాధారణ చోరీలు సైతం 52శాతం పెరిగినట్లు వివరించారు. గతేడాది 420 చోరీల కేసులు నమోదు కాగా, ఈసారి 639 నమోదైనట్లు చెప్పారు.
గతేడాది గొలుసు చోరీ కేసులు 15 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 21కు చేరినట్లు వివరించారు. చోరీ కేసుల్లో రికవరీ సొత్తు పెరిగినట్లు తెలిపారు. గతేడాది 26శాతం రికవరీ కాగా, ఈసారి 49శాతం సొత్తు రికవరీ చేసినట్లు చెప్పారు. 2024లో మొత్తం రూ.7.55 కోట్లు ఆస్తిని కోల్పోగా, ఇందులో రూ.3.73 కోట్ల సొత్తు రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలు 3శాతం పెరిగినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య, గాయపడిన వారి సంఖ్య తగ్గినట్లు చెప్పారు.
ఈ ఏడాది జిల్లాలో మొత్తం 852 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో భారీ రోడ్డు ప్రమాదాలు 365 నమోదైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 384 మంది మృతి చెందగా, 913 మంది తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. వాహనాల తనిఖీ, డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెద్దఎత్తున నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 2024లో వాహనాల తనిఖీలకు సం బంధించి 1,94,888 కేసులు నమోదు చేసి రూ.7.78 కోట్లు జరిమానాలు విధించినట్లు తెలిపారు.
వాహనాల తనిఖీ సమయంలో డ్రంకెన్ డ్రైవ్‌కు సంబంధించి 8676 కేసులు నమోదు చేసి రూ.1.13 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 65 మందికి జైలు శిక్ష పడినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 179 చీటిం గ్ కేసులు, 17 నమ్మకద్రోహం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 105 పేకాట కేసులు, 13 మట్కా కేసులు నమోదు చేసినట్లు వివరించారు.