రాయపోల్, ఆగస్టు 22: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో (Palle Pragathi) భాగంగా గ్రామపంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కానీ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పరిశుధ్య పనులు కొనసాగడం లేదు. చెత్త ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండడంతో అవి కూడా నడవడం లేదు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapole) మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో గత 20 రోజుల నుంచి చెత్త ట్రాక్టర్ నడవకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
కనీసం ట్రాక్టర్కు డీజిల్ పోయించుకోలేని స్థితిలో గ్రామపంచాయతీ ఉండడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు అంటున్నారు. రాత్రిపూట వీధి దీపాలు వెలగకపోవడంతో అందకారంలో ఉంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధాన వీధుల్లో మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీయకపోవడంతో దోమలు సైరవిహారం చేయడంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిమ్మక్కపల్లి గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలు పరిష్కరించి వీధి దీపాలు వేయించి మురికి కాలువలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామానికి శాశ్వతంగా పంచాయతీ కార్యదర్శి నియమించాలని కోరుతున్నారు.