సంగారెడ్డి, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ -కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరికివారే గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 25625, టీచర్స్ ఓటర్లు 2690 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రంతో పాటు మున్సిపాలిటీల్లో రెండు నుంచి ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 40 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ ఓటర్ల కోసం 28 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 376 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 93 మంది పోలింగ్ ఆఫీసర్లు, 87 మంది ఏపీవోలు, 196 మంది ఓపీవోలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 68 పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బందితోపాటు సామగ్రి చేరుకోనున్నది. ఇందుకోసం సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 74 పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండగా, మంగళవారం వరకు 63 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పరిశీలించేందుకు మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మ్రైకో అబ్జర్వర్లు, ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగిసింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 460 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 70 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 330 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 20 మంది ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ రూపేశ్ బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న కరీంనగర్లో జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది, మ్రైకో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పూర్తిచేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈనెల 27న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 68 పోలింగ్ కేంద్రాల్లో 25652 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 2690 టీచర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు.
పోలింగ్ కేంద్రాలున్న విద్యా సంస్థలకు 26, 27న సెలవు ప్రకటించినట్లు తెలిపారు. 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ ముగిసన అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్‌లోని రిసెప్షన్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో పరమేశం తదితరులు ఉన్నారు.