టేక్మాల్, సెప్టెంబర్ 29: ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర వివరాలను తెలుసుకోవడానికి ఇంటింటి కుటుంబ సర్వే (Samagra Kutumba Survey) చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గతేడాది నవంబర్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులతో సర్వే చేయించింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో సర్వే చేసిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను వినియోగించుకున్నారు. ఆన్లైన్ చేసిన సర్వే వివరాలను బట్టి పారితోషికం ఇస్తామని ఆపరేటర్లకు చెప్పి వారితో పని చేయించుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సర్వే వివరాలను ఆన్లైన్ పూర్తిచేశారు. అయినా ఇవ్వాల్సిన పారితోషికం మాత్రం ఇప్పటికి ఇవ్వలేదు.
సర్వే చేసి సేకరించిన వివరాలను ప్రత్యేకంగా ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం పలు శాఖలలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లతో ప్రభుత్వం వివరాలను నమోదు చేయించాలనుకున్నారు. సర్వే వివరాలు ఎక్కువగా ఉండటం, నిర్దేశించిన సమయంలో నమోదు చేయడం సాధ్యం కాలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో వివరాల నమోదుకు ప్రైవేటు వ్యక్తులను తీసుకుని నిర్దేశించిన గడువులో కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాలో సుమారు 600 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లు రోజువారిగా విధించిన టార్గెట్ను పూర్తి చేయడానికి రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు.
అహర్నిశలు శ్రమించిన ఆపరేరట్లరు ఆన్లైన్లో సర్వే వివరాలను ప్రభుత్వం సూచించిన గడువులోపు పూర్తి చేశారు. త్వరితగతిన సర్వేను ఆన్ లైన్ పూర్తి చేస్తే త్వరగా వస్తాయని ఆశపడిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిగా ఎదురుచూపులు తప్పలేదు. ఉపాధి లేక ఆన్లైన్ వర్క్స్ చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్న నిరుద్యోగ యువతతో చేయించుకున్న పనికి ప్రతిఫలం ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సర్వే చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పారితోషికం ఇచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులతో పనిచేయించుకుని పారితోషికం ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వే వివరాలను ఆన్ లైన్ చేసిన ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు.