గజ్వేల్, జూన్ 20: పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాఫూర్ సమీపంలోని బింగిఎల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు అందించి బడుగుల గుండెల్లో నిలిచిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచామని, రూ.900కోట్లతో సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా పేదలను ఆదుకున్నామన్నారు.
త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గంలో రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రూ.13వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో రూ.5లక్షలతో 600ఫీట్ల వరకు మాత్రమే ఇల్లు నిర్మించుకునేలా ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్లు గరీమాఅగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీవో చంద్రకళ, హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయమోహన్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.