జాన్సీలింగాపూర్ పాఠశాలకు మంచి రోజులు
మన ఊరు-మనబడికి ఎంపికతో తీరనున్న సమస్యలు
పాఠశాల అభివృద్ధికి రూ. 13.96 లక్షలు మంజూరు
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ విద్యాబోధనకు సిద్ధ్దం
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
రామాయంపేటరూరల్, ఏప్రిల్11 : ఏండ్ల తరబడి ఆ పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. మౌలిక వసతుల కొరత వేధిస్తున్నది. వాటి పరిష్కారానికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సి ఉన్నది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యల పరిష్కారానికి ఎన్నో ఏండ్లుగా ఎదురు చూశారు. నేడు ఆ పాఠశాలకు మంచి రోజులు వచ్చాయి. మన ఊరు-మన బడికి రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. దీంతో కమిటీ వేసి అధికారులు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అయ్యే ఖర్చు, వచ్చే ఏడాది ఇంగ్లిష్ విద్యాబోధన చేయడానికి ఉపాధ్యాయులను సిద్ధ్దంచేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 63 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ముఖ్యంగా పాఠశాలలో మంచినీటి సౌకర్యం,విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వురుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు,ప్రతి తరగతి గదికి గ్రీన్చార్ట్ బోర్డు, వైరింగ్, విద్యార్థులకు ఫర్నిచర్,కలరింగ్,మినీ ట్యాంక్ నిర్మాణం, బోరు కోసం మన ఊరు-మన బడిలో ఎంపికైన తర్వాత అధికారులు పాఠశాలను సందర్శించి నివేదికలు తయారు చేశారు. దీంతో వీటి పరిష్కారానికి రూ. 13.96 లక్షలు మంజూరైనట్లు పాఠశాల హెచ్ఎం రాంచంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఇంగ్లిష్ విద్యాబోధనకు సిద్ధ్దమవుతున్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
మా పాఠశాల మన ఊరు-మన బడికి ఎంపిక కావడం త్వరిత గతిన మౌలిక వసతుల పరిష్కారానికి నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ విద్యాబోధన కూడా ప్రారంభం కానున్నది.. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారమవుతుండటంతో సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-రాంచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు
ఎన్నో ప్రభుత్వాలు మారాయి..
ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ, సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ బడులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రభు త్వం వచ్చాక విద్యా వ్యవస్థకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చాలా వరకు మౌలిక వసతుల సమస్యలు వేధిస్తున్నాయి. వాటి పరిష్కారం తర్వాత ఇంగ్లిష్ విద్యాబోధన అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది.
-సత్యనారాయణ,ఎస్ఎంసీ చైర్మన్
మేమూ ఇంగ్ల్లిష్లో చదువుకుంటాం..
ఇంగ్ల్లిష్ మీడియంలో చదువుకోవాలని ఎంతో ఆశ ఉండేది. వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు బడుల్లో చదివించే పరిస్థితి మా తల్లిదండ్రులకు లేదు. బాధగా ఉండేది. వచ్చే ఏడాది మాకు కూడా ఇంగ్లిష్లో చదువు చెప్తామని మా సార్లు చెప్పారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-సాయికుమార్, కావ్య, విద్యార్థులు