పాపన్నపేట, నవంబర్ 1 : పొట్టకూటి కోసం జెర్రుపోతులాట అన్న సామెత గుర్తుకు వస్తుంది. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను చూస్తే..ఎవరైనా కష్టపడి ఉద్యోగం చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి.దీంతో కుటుంబం గడుస్తుంది అనే కదా ఉద్యోగం చేసేది. కానీ, అన్ని విద్యార్హతలు ఉండి ఉద్యోగం చేస్తున్నా ఐదు నెలలుగా వేతనాలు రాక నానా బాధలు పడుతున్న 2008 ఉపాధ్యాయుల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.2008 డీఎస్సీ అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 15న కాంట్రాక్ట్ కింద నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వీరిని కాంట్రాక్ట్ కింద నియమించి ఫిక్స్ శాలరీ కింద రూ.31,040 వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.వీరు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు.అయినప్పటికీ ప్రభుత్వం వీరిపై చిన్నచూపు చూస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.వీరు నియామకం అయినప్పటి నుంచి కేవలం రెండు నెలల వేతనాలే చెల్లించింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులు కావడంతో వీరికి వేసవి సెలవుల్లో జీతాలు రావు. అకడమిక్ ఇయర్ ప్రారంభం జూన్ నుంచి నేటి వరకు వీరికి వేతనాలు అందలేదు.దీంతో కుటుంబాలు ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.వచ్చే అతి తక్కువ వేతనం సమయానికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తమపై దృష్టిపెట్టి వేతనాలు అందించాలని, తమను రెగ్యులర్ చేయాలని టీచర్లు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1382 మంది 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు ఉండగా, మెదక్ జిల్లాలో 54 మంది ఉన్నారు.
2008 డీఎస్సీ ఉపాధ్యా యులకు వెంటనే వేత నాలు చెల్లించాలి.ఐదు నెలలుగా వేతనాలు అం దక టీచర్లు తీవ్ర ఆర్థి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారి కుటుంబ సభ్యులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.దీంతో పాటు వారిని రెగ్యులరైజ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వీరి గురించి పట్టించుకోవాలి.
-పంతులు రాజు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు పాపన్నపేట, మెదక్ జిల్లా