సిద్దిపేట, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)ను విస్తరిస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా అంతటికి సుడా ను విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వరకు సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాలు సుడా పరిధిలోకి వచ్చేవి. తాజాగా జిల్లా అంతటికి సుడాను విస్తరించడంతో మరో అధికార కేంద్రం ఏర్పాటు కానున్నది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి.
వీటిలో మర్కూక్, ములు గు, వర్గల్ మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఇవి పోను మిగిలిన 23 మండలాల్లోని 286 గ్రామాలు దుబ్బాక, గజ్వేల్- ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలను సుడా పరిధిలో కలుపుతూ ప్రభుత్వం ఈనెల 15న జీవోను విడుదల చేసింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలు, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మం డలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు సుడా పరిధిలోకి వస్తాయి.
సిద్దిపేట అర్బన్ డెవలప్మెం ట్ అథారిటీ(సుడా)ను 30 అక్టోబర్ 2017న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పా టు చేసి 2018 ఏప్రిల్‌లో నూతనంగా 14 మందితో పాలక మండలిని నియమించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సుడాను జిల్లా అంతటికి విస్తరించింది.
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) విస్తరణ అధికారం కోసమేనా..? పదవుల కోసమా..? అనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతున్నది. సుడాను విస్తరించడంతో జిల్లాలో మరో అధికార కేంద్రం ఏర్పాటు కానున్నది. సిద్దిపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు పదవుల సృష్టించడం కోసమే దీనిని విస్తరించినట్లు సమాచారం. సుడాకు చైర్మన్‌తోపాటు జంబో కార్యవర్గాన్ని ప్రభుత్వం నియమించనున్నది హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సుడా ను జిల్లా అంతటికి విస్తరించటంతో అధికారం తమ చేతుల్లోకి తెచ్చుకోవచ్చు అనే లక్ష్యంతో ఈ రకంగా చేసి ఉంటారన్న చర్చ జరుగుతున్నది. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం పదవులు రానున్నయని మాటలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట పరిధి వరకు ఉన్నప్పుడు స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతోమంది సుడా చైర్మన్ పదవి కోసం పోటీపడ్డారు. తమకంటే తమకు సుడా చైర్మన్ పదవి అని చెప్పుకున్నారు. తాజాగా దానిని జిల్లా అంతటికి విస్తరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినైట్లెంది. ఇప్పుడు సిద్దిపేట నేతలకు ఈ పదవి వచ్చే అవకాశాలు లేవు.
ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతకు వరించింది. జిల్లా కేంద్రంలో ఉన్న ఎంతోమంది సీనియర్ నాయకులకు పదవులు వస్తాయని ఆశిస్తే వారి ఆశలు ఆడియాసలు అయ్యాయి.జిల్లా అంతటకి ప్రొటోకాల్ ఉండే ఈ చైర్మన్ పదవికి చాలామంది పోటీపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు చెందిన నేతకు సుడా చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మరో నెల రోజులైతే ఏడాది పూర్తి అవుతుంది. ఇంత వరకు జిల్లా అభివృద్దికి రూపాయి నిధులు మం జూరు కాలేదు.
అభివృద్ధి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎన్నికల హామీలు ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావ డం లేదు. రైతుబంధు రాలేదు. రుణమాఫీ సగం మందికి అయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఏడాది కాలంలో తాము ఇది చేశామని గొప్పగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదీ లేదు, అందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని అన్నివర్గాలు విమర్శిస్తున్నాయి.