సిద్దిపేట,జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్నా గ్రామాలకు రూపాయి నిధులు ఇవ్వలేదు.ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది.పేరుకు ప్రత్యేకాధికారుల మాటే కానీ వారు గ్రామాల వైపు తొంగిచూసిన దాఖలాలు లేవు. భారంమొత్తం పంచాయతీ కార్యదర్శులపైనే పడుతుంది.ప్రభుత్వం నిధు లు ఇవ్వడం లేదు. తాము ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయలేం..ఆభారం మా వల్ల కాదు అని చాలా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళా లు ఉన్నతాధికారులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
నిధుల మాట ఎత్తితే చా లు ఆకార్యదర్శిపై ఉన్నతాధికారుల వేధింపులు తప్పడం లేదు.మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదు అన్నందుకు ఏకంగా కలెక్టర్ ఆపంచాయతీ కార్యదర్శికి షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. నిధులు ఇవ్వరు తాము సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యం అంటు వాపోతున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి లక్షల్లో ఖర్చు చేశారు.ఇంత చేసినా తమకు గుర్తింపు లేదని మండిపడుతున్నారు.
పల్లెల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి
కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా నిధులను నేరుగా గ్రామాలకు విడుదల చేసింది. ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలకు 494 ట్రాక్టర్లు ఉన్నాయి. 477 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో 469 ట్రాక్టర్లు ఉండగా 468 పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 ( ప్రస్తుతం 620) గ్రామ పంచాయతీల్లో 636 ట్రాక్టర్లు ఉండగా అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు.
గ్రామాలు ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దబడ్డాయి. పలు గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం లోపించింది. గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. 18 నెలలుగా గ్రామాలకు నిధులు రావడం లేదు.గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. పంచాయతీల పాలక వర్గం గడువు 2024 ఫిబ్రవరిలో పూర్తి అయ్యింది. గడువు ముగియగానే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించారు.వీరిని నియమించినా భారం మొత్తం పంచాయతీ కార్యదర్శుల మీదనే పడుతుంది.గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు. సరైన పర్యవేక్షణ లేక గ్రామాలు అధ్వానంగా తయాయ్యాయి.
పల్లెల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఇదివరకు చేసిన బిల్లులు రాకపోవడంతో పాటు కొత్త పనులు పూర్తికాలేదు. దీంతో గ్రామాల్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా తయారైంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు సైతం జరగడం లేదు. ప్రధానంగా గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం సమస్యలు నెలకొన్నాయి. పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న గ్రామాల్లో కొంత ఆదాయం వచ్చినా వాటిని వినియోగించకుండా ప్రభుత్వం వాటిపై ఫ్రిజింగ్ విధించింది. దీంతో ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఆదాయ వనరులు ఉన్న పంచాయతీల్లోనే జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంటే, ఆదాయం లేని గ్రామాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రావడం లేదు.
కేసీఆర్ ప్రభుత్వంలో నెల నెలా నిధులు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతి నిధులు ప్రతినెలా విడుదల చేసింది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా అద్భుత ప్రగతి సాధించాయి. ఉమ్మడి జిల్లాకు సుమారు నెలకు రూ.30 కోట్లపైచిలుకు నిధులు వచ్చాయి. ఇవి కాకుండా గ్రామాల్లో పన్నుల ద్వారా ఇతరత్రా ఆదాయం వస్తే అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి కింద విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, హరితహారంలో విరివిగా మొక్కలు నాటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనిచ్చారు. తాగునీటి సమస్య లేకుం డా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయక గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది.