కల్హేర్/సిర్గాపూర్, మార్చి 29: హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థి దార నిఖిల్ కుమార్(14) మృతిచెందడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై శనివారం ధర్నా చేశారు. దార నిఖిల్ కుమార్ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లి స్వగ్రామం.
వారం క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అతని ఆరోగ్యం దెబ్బతినడంతో 26న పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థి కుటుంబీకులు తొలుత నారాయణఖేడ్‌లోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. అక్కడి వైద్యులు సంగారెడ్డికి తీసుకెళ్లాలని సూచించారు. సంగారెడ్డి తరలించి అక్కడ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వైద్యుల సూచనతో హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం విద్యార్థి నిఖిల్ మృతిచెందాడు. తమ కుమారుడి మృతికి గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ విద్యా ర్థి మృతదేహాంతో గురుకుల పాఠశాల ముట్టడికి దళిత నాయకుడు అలిగే జీవన్ ఆధ్వర్యంలో యత్నించారు. పోలీసులకు సమాచారం అందడంతో మార్గమధ్యలో వారిని అడ్డుకుని గురుకుల పాఠశాల వైపు రాకుండా నివారించారు.
దీంతో వారు రోడ్డు పైనే బైఠాయించి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తి ఘటనా స్థలానికి చేరుకుని గురుకుల పాఠశాలల ఆర్సీవో నిర్మలతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.50వేలు నగదు అందజేసి, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ‘ఖేడ్’ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయని, అందుకే గురుకుల విద్యా ర్థి నిఖిల్ మృతిచెందాడని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు చేపట్టిన ధర్నా వద్దకు చేరుకుని ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించారన్నారు. ఇప్పుడు గురుకులాలు అధ్వానంగా తయారై విద్యార్థుల పాలిట శాపాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఒకరికి ఉద్యో గం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.