రామచంద్రాపురం, డిసెంబర్ 31 : ల్యాండ్‌పూలింగ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రయోజం చేకూర్చుతుంది. వినియోగంలో లేని అసైన్డ్ భూములను ప్రభుత్వం రైతుల నుంచి తీసుకొని వారికి గజాల రూపంలో స్థలాలను కేటాయించి హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి ఇస్తున్నది. ఈ ప్రక్రియతో అసైన్డ్ భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్‌పూలింగ్‌తో రైతులు, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతున్నది. అసైన్డ్ చట్టంలో భాగంగా అసైన్డ్ భూములు పొందిన రైతులు ఎవరికి అమ్మడానికి వీలు లేదు. కేవలం వ్యసాయం మాత్రమే చేయాలి. రైతు కుటుంబీకులు మాత్రమే ఆ భూమిని అనుభవించాలి. ఎవరికైన అమ్మినా, అందులో ఏ విధమైన నిర్మాణా లు చేపట్టిన చట్టవిరుద్ధం.
ఒకవేళ తిరిగి ప్రభుత్వానికి అసైన్డ్ భూములు అవసరం ఉంటే వాటిని రైతుల నుంచి స్వాధీనం చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఎన్నో ఏండ్లుగా ఆ భూములనే నమ్ముకొని ఉన్న రైతులకు అన్యా యం చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అసైన్డ్ భూములకు ధర కట్టించి రైతుల నుంచి భూములను తీసుకుంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం రైతులు బతకడానికి అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ భూమిని రైతులకు అసైన్డ్ చేసింది. గతంలో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. కానీ, హైదరాబాద్‌కి దగ్గరలోని ప్రాంతాలు మొత్తం కాంక్రిట్ జంగల్‌గా మారిపోవడంతో వ్యవసాయం తగ్గి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది.
పట్టణీకరణ విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో వ్యవసాయ భూములు కనుమరుగయ్యాయి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలో లేని అసైన్డ్ భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు రెవెన్యూ శాఖ ల్యాండ్పూలింగ్ని చేపడుతున్నది. ల్యాండ్‌పూలింగ్ విధానం సత్ఫలితాలు ఇస్తున్నది. ఈ విధానంతో రైతులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
కొల్లూర్‌లో 200 ఎకరాలు..
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో ఉన్న సర్వేనంబర్ 297లో 301 ఎకరాల భూమి ఉంది. అందులోనే రెండు తండాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మిగులు భూమి గా ఉన్న 200 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించారు. 200 ఎకరాల భూమికి 190 మంది రైతులు పొజిషన్లో ఉన్నారు. ల్యాండ్‌పూలింగ్‌కి ఒప్పుకొని 130 మంది రైతులు ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా రైతులు వచ్చి వారి భూములను ఇచ్చే విధంగా అధికారులు ల్యాండ్‌పూలింగ్ చేపడుతున్నారు. భూములు ఇవ్వాలంటూ ఏమాత్రం రైతు లపై ఒత్తిడి తేవడం లేదు.
గతంలో ఎకరం భూమి ఉన్న రైతుకు 600 గజాల స్థలం ఇస్తామని అధికారులు తెలిపారు. దానికి రైతులు సుముఖంగా లేకుండే. కానీ, కొల్లూర్కి పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా మోకిలలో ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా ఎకరం ఉన్న రైతుకు 750 గజాల స్థలం కేటాయించింది. ఆ విధంగా అమలు చేయాలని రైతులు కోరడంతో సంగారెడ్డి కలెక్టర్ శరత్ స్పం దించి ఎకరం భూమి ఉన్న రైతుకు 750 గజాల స్థలం కేటాయిస్తామని చెప్పడంతో రైతులు ముం దుకు వస్తున్నారు. 297 సర్వేనంబర్‌లోనే రైతులకు హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి అన్ని అనుమతులతో పాటు విద్యుత్లైన్లు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలతో కూడిన 750 గజాల ప్లాట్ కేటాయించనున్నారు.
ల్యాండ్‌పూలింగ్ ద్వారా సేకరించిన భూమిని రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏకు అప్పగిస్తారు. ప్రస్తుతం కొల్లూర్ ప్రాంతం ప్రైమ్ ఏరియాగా మారింది. సుమారుగా గజం స్థలం ఈ ప్రాంతంలో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కో రైతుకు రూ.4కోట్ల నుంచి రూ.7.5కోట్ల వరకు ప్రయోజనం ఉంటుంది. అసైన్డ్ భూములను నమ్ముకొని బతుకున్న రైతులను ప్రభుత్వం కోటీశ్వరులను చేస్తున్నది. కొల్లూర్‌లోని సర్వేనంబర్ 191లో కూడా అధికారులు 50ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
రైతులు ఆలోచన చేయండి..
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కొల్లూర్ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కొల్లూర్‌లో గతంలో రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములు ప్రస్తుతం వినియోగంలో లేక బీడు భూములుగా మారాయి. కొద్ది మేర మాత్రమే కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం అందుబాటులో ఉన్న భూమిని బట్టి అప్పటి ప్రభుత్వం ఒక్కో రైతు కు ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూముల్లో సాగు చేసుకొని జీవించాలని నిబంధనలు పెట్టారు. ప్రజా అవసరాల కోసం ఈ భూములను ప్రభుత్వం ఎప్పుడైన తిరిగి వెనక్కి తీసుకువచ్చనే నిబంధనలతో పట్టాలు ఇచ్చారు.
నిరూపయోగంగా అమ్ముకోవడానికి వీలేని అసైన్డ్ భూములను ల్యాండ్‌పూలింగ్ ద్వారా ఎకరం ఉన్న రైతుకు హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి 750 గజాల స్థలాన్ని అన్నిహక్కులతోపాటు అనుమతులతో అందజేస్తా రు. నిబంధనల ప్రకారం పరిహారం డబ్బు రూ పంలో ఇస్తే లక్షల్లోనే ఉండేది. ఇలా భూమి రూ పంలో ఇవ్వడంతో పేదలకు కోట్లలో పరిహారం అందుతుంది. ఈ ప్లాట్లను రైతులు వారి అవసరాల కోసం ఏవిధంగానైనా వినియోగించుకోవచ్చు. ఎలాంటి నిబంధనలు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. రైతులు ఆలోచన చేసి ముందుకువచ్చి భూములను అప్పగిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అధికారులు కేటాయించే 750 గజాల స్థలం అసైన్డ్ రైతుల తలరాతను మార్చనుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
అసైన్డ్ భూమి ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం. ఎకరం అసైన్డ్ భూ మి ఉన్న రైతుకు సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు 750 గజాల స్థలా న్ని హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి ఇస్తున్నది. కొల్లూర్‌లోని సర్వేనంబర్ 297 లో 200 ఎకరాలు, 191లో 50 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించాం. 297కు సంబంధించి 190 మంది రైతులకు 130మంది ముందుకువచ్చారు. ల్యాండ్‌పూలింగ్ ద్వారా సేకరించిన భూమిని హెచ్ఎండీఏకు అప్పగిస్తాం. హెచ్ఎండీఏ కేటాయించనున్న 750 గజాల స్థలా న్ని రైతులు ఎప్పుడైనా అమ్ముకునే హక్కు ఉంటుం ది. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
– జయరాం, తహసీల్దార్, ఆర్సీపురం