సంగారెడ్డి, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): ప్రజా ఆందోళనలు రేవంత్ సర్కారుకు పట్టడం లేదు. పార్యానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ 11 రోజులుగా గుమ్మడిదల మండలం ప్రజలంతా జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్నిపార్టీలు, అన్నివర్గాలు ఏకమై ముక్తకంఠంతో డంప్‌యార్డు వద్దంటూ నిరసనలు తెలుపుతున్నారు. ప్రతిరోజు వినూత్నంగా నిరసనలు తెలుపుతూ డంప్‌యార్డు నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ, ప్రభుత్వం దీనిపై వెనకడుగు వేయడం లేదు. కనీసం స్పందించడం లేదు.
ప్రజాపాలన అంటూ గొప్పలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి డంపింగ్‌యార్డు ఆందోళనలు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి వరకు డంప్‌యార్డుపై అధికారికంగా స్పందించలేదు. ప్రజలు ఆందోళనలు తీవ్రం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పనులు ఆపడం లేదు. డంప్‌యార్డు విషయంలో వెనక్కి తగ్గితే తమ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ప్రభుత్వంలోని పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ మొదటి నుంచి ప్యారానగర్లో డంప్ యార్డును వ్యతిరేకించడమే కాకుండా ప్రజలతో కలిసి ఆందోళన చేస్తున్నది. ప్యారానగర్లో డంప్‌యార్డు నిర్మాణం పనులు ప్రారంభించింది మొదలు 10 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. జేఏసీ నాయకులతో పాటు ప్రజలను కలుపుకొని బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు, గుమ్మడిదల మండల బీఆర్ఎస్ నాయకులు డంప్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
డంప్‌యార్డు నిర్మాణంపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా సర్వే చేయాలని కోర్టు సూచించింది. దీంతో సర్వే పనులు కొనసాగుతున్నాయి. సర్వే ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు డంప్‌యార్డు పనులు తిరిగి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో డంప్‌యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్, జేఏసీ నాయకులు సన్నద్ధవుతున్నారు. డంప్‌యార్డుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించనున్నారు. సోమవారం హైకోర్టులో బీఆర్ఎస్, జేఏసీ నాయకులు కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించనున్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని జేఏసీ నాయకులు ధీమాతో ఉన్నారు. డంప్‌యార్డు ఏర్పాటుతో ప్యారానగర్, కొత్తపల్లి గ్రామవాసులతో పాటు గుమ్మడిదల ప్రజలకు జరిగే నష్టాలను కోర్టుకు వివరించి న్యాయం చేయాలని కోరుతామని జేఏసీ నాయకులు చెబుతున్నారు.
పార్యానగర్లో డంప్‌యార్డు ఏర్పాటును దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ టైనింగ్ అకాడమీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. డంప్‌యార్డు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని అకాడమీ వింగ్ కమాండ్ శుభమ్ మిశ్రా ఇటీవల సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. డంప్‌యార్డు ఏర్పాటు కారణంగా పక్షుల సంచారం పెరిగి ఎయిర్‌ఫోర్స్ శిక్షణకు ఆటంకం కలగడంతో పాటు శిక్షణ పైలెట్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని తన లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఈ లేఖపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. లేఖపై కలెక్టర్ వల్లూరు క్రాంతి జీహెచ్ఎంసీ అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. డంప్‌యార్డు ఏర్పాటును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అధికారులు బెంగళూరు, ఢిల్లీలోని ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు తెలుస్తుంది. డంప్‌యార్డు ఏర్పాటుతో చోటుచేసుకునే ప్రమాదాలు, నష్టాలపై దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సొంతంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.