గజ్వేల్, జూలై 12: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, రైతులకు సాగునీళ్లు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకాలంలో కాల్వల ద్వారా సాగునీళ్లు అందించడంతో రైతులకు మేలు చేకూరిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ కాల్వల ద్వారా సాగునీళ్లు అందించకపోవడంతో రైతులు నాట్లు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాల్వల ద్వారా సాగునీళ్లు అందించి అన్ని ప్రాంతాల రైతులను ఆదుకోవాలన్నారు. సాగునీళ్లు వదలకుండా కుట్రలు చేస్తూ రైతుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు. వర్షాలు లేక రైతులు సాగునీళ్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గతంలో అధికారులకు ఆదేశాలు ఇస్తే వెంటనే రైతులకు సాగునీరు అందించారని, కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు.
కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి, రామాయంపేట కెనాల్ వద్ద హల్దీవాగులోకి, కొండపోచమ్మసాగర్ నుంచి జగదేవ్‌పూర్ కెనాల్లోకి నీళ్లు వదలాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాజీవ్ రహదారిని దిబ్బంధం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా వదలకపోవడం దారుణమన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు రామచంద్రం, కనకయ్య, రవీందర్, శ్రీనివాస్, సురేశ్, రమేశ్, ప్రతాప్‌రెడ్డి, అహ్మద్, హనుమంతరెడ్డి, ఉమార్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గపరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 48మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో గరిష్ఠ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేశారని గుర్తుచేశారు. పేదల పట్ల ఆలోచించి ఈ పథకంలో నిధులు పెంచాలన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేంద్రంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.