మెదక్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకు ఏడాది కావస్తున్నది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శులు పనులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది కార్యదర్శులు అప్పులు తెచ్చి పంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 21 మండలాలు… 469 జీపీలు…
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. 2వ తేదీన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హెచ్ఎంలతో పాటు ఇతర అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఏడాది కాలంగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు విడుదల కావడం లేదు. దీంతో పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉన్నారు. 1629 మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. పంచాయతీల్లో 500 జనాభా ఉన్న పంచాయతీలకు ఇద్దరు చొప్పున కార్మికులు పనిచేస్తుండగా, 1000 జనాభా ఉన్న పంచాయతీలకు ముగ్గురు, 1500 జనాభా ఉన్న పంచాయతీలకు నలుగురు, మేజర్ గ్రామ పంచాయతీల్లో 15 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరు మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీలకు వచ్చే పన్నుల వసూళ్లతో కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. డిసెంబర్ వరకు కార్మికుల వేతనాలు చెల్లించారు. జనవరి నుంచి ప్రభుత్వం నేరుగా కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తోంది.
ప్రత్యేక పాలన పొడిగించేనా…?
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఐదేండ్లకు ఒకసారి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జడ్పీ పాలకవర్గాల గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమని తాత్కాలికంగా వాయిదా వేసి ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, మరో ఆరు నెలలు పొడిగించింది.
ప్రస్తుతం పన్నెండు నెలలు పూర్తవుతున్నా గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులను సైతం కేటాయించి బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఫిబ్రవరి చివరి వారంలోపు ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆలస్యమయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఉండడంతో ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రూ.25 కోట్ల బకాయిలు…
మెదక్ జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.25కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం, సీసీ రోడ్లు, వీధిలైట్లు, తాగునీటి పైపులైన్ లీకేజీల మరమ్మతులు, ఇతర పనుల కోసం మాజీ సర్పంచులు డబ్బులు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనుకున్న మాజీ సర్పంచులకు షాక్ తగిలింది. ఏడాది గడిచినా నేటికి బిల్లుల చెల్లింపు జరగలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు తమ నిరసనలు తెలిపారు. కానీ, ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
62 శాతమే పన్ను వసూలు…
2024-2025 ఆర్థిక సంవత్సరానికి మెదక్ జిల్లాలో రూ.12.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.7.71 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.4.74 కోట్ల వరకు పన్నులు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలో కేవలం 62శాతం ఆస్తి పన్ను వసూళ్లు మాత్రమే అయ్యాయి. పన్ను వసూళ్ల కోసం మార్చి 31 వరకు గడువు ఉంది. పన్ను వసూళ్లలో రాష్ట్రంలో మెదక్ జిల్లా పదో స్థానంలో ఉంది. ఎన్నికల హడావిడి, ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించడం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అన్ని పథకాలపై పంచాయతీ అధికారులు దృష్టిపెట్టడంతో ఆస్తి పన్నుల వసూళ్లలో ఆలస్యమైనట్టు తెలుస్తోంది.
ప్రజలకు ఇబ్బందులు రానివ్వం..
గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ముఖ్యంగా తాగునీటి సమస్య, వీధిలైట్లు, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిసారించాం. డిసెంబర్ వరకు పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాం. సర్కార్ ఆదేశాలతో పరిపాలనలో లోటుపాట్లు లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం.
– యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి, మెదక్