జహీరాబాద్, ఏప్రిల్ 29 : చిరుధాన్యాల సంరక్షణలో జహీరాబాద్ డీడీఎస్ సొసైటీ మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న కృషి ఎనలేనిదని విత్తన శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ కొనియాడారు. జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఎస్ కార్యాలయ ఆవరణలో విత్తన సంరక్షకుల సమావేశాన్ని నిర్వహించారు. డీడీఎస్ సొసైటీ పరిధిలోని 30 గ్రామాలకు చెం దిన 60 మంది విత్తన సంరక్షకులు 70కి పైగా దేశీ విత్తనాలను ప్రదర్శించారు. ఇం దులో అంతరించిపోతున్న అత్తాకోడళ్ల జొన్నలు, నల్లతొగరి, బుర్క తొగరి, తెల్ల శనగలు, నల్ల కొబ్బరి వంటి అరుదైన విత్తనాల ప్రదర్శన ఆకట్టుకుంది.
ఆనంతరం విత్తన శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ మాట్లాడుతూ..అంతరించిపోతున్న పూర్వ వ్యవసాయ పద్ధ్దతులు, విత్తనాలను మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రపంచ దేశాలు సైతం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కనుమరుగవున్న చిరుధాన్యాలను కాపాడుతూ, సాగు చేస్తున్న డీడీఎస్ మహిళా సంఘాల చేస్తున్న కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరో గ్యం చేకూరుతుందన్నారు. డీడీఎస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దివ్య వెలుగురి మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశా ల్లో రైతులు విత్తనాలను దాచుకునే హక్కు లు లేవన్నారు.
ప్రతి విషయంలో మార్కె ట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో రైతులు ఉన్నట్లు తెలిపారు. డీడీఎస్ సొసైటీ మహిళలు చిరుధాన్యాలను కాపాడుతూ, పంటల సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఝరాసంగం మండలం బిడెకన్న గ్రామానికి చెందిన జడల చంద్రమ్మ 58 రకాల విత్తనాలు, న్యాల్కల్ మండలంలోని గుంజోట్టికి చెందిన నర్సమ్మ 56 రకాల విత్తనాలు, జహీరాబాద్ మండలం పొట్పల్లికి చెందిన మొగులమ్మ 55 రకాల విత్తనాలను ప్రదర్శించారు. వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, సొసైటీ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు.