సంగారెడ్డి, జనవరి 11: వైకుంఠపురం గోదారంగనాథస్వామి రథోత్సవం కన్నుల పండువగా శోభాయాత్ర జరిగిం ది. బుధవారం సాయంత్రం పట్టణంలోని శ్రీబాలాజీ మం జీరా గార్డెన్ నుంచి అంగరంగా వైభోవేపేతంగా రథోత్సవం ఊరేగింపులో కలెక్టర్ శరత్‌కుమార్ నాయక్, అదనపు కలెక్ట ర్ రాజర్షి షాలు పాల్గొని ప్రారంభించారు. శోభాయాత్రలో పాల్గొన్న అధికారులకు ఆలయ అర్చకులు తలపాగాలు తొడిగి శాలువాలు కప్పి సత్కరించారు. వైకుంఠపురం ఆలయ ప్రధానార్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా పట్టణంలోని ప్రధాన రహదారి గుండా కొనసాగింది.
శోభయాత్రలో పలు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన కళాకారుల విన్యాసాలు, కోలాటాలతో పట్టణవాసులను ఆకట్టుకున్నాయి. కేరళ వాయిద్యాలతో జిల్లా కేంద్రంలో సందడిగా మారింది. ప్రత్యేకంగా ఇస్కాన్ సంస్థ సభ్యులు భజన పాటలతో ప్రజలను మైమరిపించారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం సంతరించుకుని రహదారి పొడవునా ప్రజలు, భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు.