రామచంద్రాపురం, ఏప్రిల్ 20 : హైరైస్ నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్‌లో ముప్పా మెడోస్‌లో నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికులకు ‘నిపుణ్’ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ సాయి మేక, ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వెంకయ్య చౌదరి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ హైరైస్ అపార్ట్మెంట్లకు వేదికగా నిలుస్తున్నదన్నారు. నిర్మాణ రంగంలో ఫాస్ట్ గ్రోత్ ఉన్నదన్నారు. హైదరాబాద్‌లో 30 నుంచి 50 అంతస్తుల హైరైస్ అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. హైరైస్ నిర్మాణంలో వేగంగా అభివృద్ధి చెందుతునప్పటికీ కార్మికుల భవిష్యత్తు కూడా ముఖ్యమేనన్నారు. బహుళ అంతస్తుల నిర్మాణంలో పని చేసే కార్మికుల రక్షణ కోసం నారెడ్కో వారికి నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్మికుడు బాగుంటేనే బిల్డర్ బాగుంటాడని, బిల్డర్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుందని పేర్కొన్నారు.
హైరైస్ అపార్ట్మెంట్లు నిర్మించేటప్పుడు కార్మికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవిధమైన రక్షణ పరికరాలు ధరించాలనే దానిపైన శిక్షణ ఇవ్వడం ఎంతో మేలు చేస్తుందన్నారు. సెల్లార్స్, సెంట్రింగ్ చేసేటప్పుడు కార్మికులు జాగ్రత్తలతో పాటు నిబంధనల ప్రకారం పనులు చేయాల్సి ఉంటుందన్నారు. నారెడ్కో వారు కార్మికుల ప్రయోజనం కోసం నిర్మాణ రంగంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు. నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ హైరైస్ అపార్ట్మెంట్స్ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు నిర్మాణాల విషయంలో అవగాహన తప్పనిసరి అవసరమన్నారు. కార్మికులు బాగుంటేనే నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలోనే మొదటగా ముప్పా ప్రాజెక్ట్‌లో కార్మికులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మున్ముందు హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి కార్మికులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణ పొందిన కార్మికులకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ సర్టిఫికెట్ వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. కార్మికులకు రూ.2లక్షలు బీమా ఉం టుందన్నారు. కార్యక్రమంలో వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.