గుమ్మడిదల, మే 10: తాతముత్తాల కాలం నుంచి అసైన్డ్భూములను నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్న పేద రైతుల భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర్లలో అసైన్డ్ భూమి 400 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి మార్చి 13న ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న అన్నారంలోని 261/1 సర్వేనంబర్ నుంచి 261/1/68 సర్వే నంబర్లోని 66 ఎకరాల భూములను టీజీఐఐసీకి అప్పగించేందుకు గెజిట్‌ను విడుదల చేసింది. హత్నూర మండలంలోని 380 సర్వే నంబర్లోని 13.22 ఎకరాల భూములు టీజీఐఐసీకి అప్పగించేందుకు గెజిట్‌ను విడుదల చేసి పారిశ్రామికీరణ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇంత పెద్దమొత్తంలో టీజీఐఐసీకి భూములు అప్పగించడంతో రైతులు రోడ్డున పడే అవకాశం ఉంది. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, అన్నారం, హత్నూర మండలంలోని బొరపట్ల అసైన్డ్ భూములు రైతుల చేతుల నుంచి పోయి ఉపాధి కోల్పోనున్నారు. ఏండ్ల నుంచి ఈ భూముల్లో కూరగాయలు, వరి సాగుచేస్తూ బతుకుతున్నామని, ఈ పచ్చని పంటపొలాలను టీజీఐఐసీకి అప్పగించి మాబతుకులు ఆగం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మా భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున రైతు పోరాటం చేస్తామని నల్లవల్లి,అన్నారం రైతులు హెచ్చరిస్తున్నారు. గుమ్మడిదల మండలంలోని అన్నారం రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ భూముల ధర మార్కెట్లో ఎకరానికి సుమారుగా రూ.4 కోట్ల పైనే పలుకుతున్నది.
మార్చి నెల 10న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారంలోని 261 అసైన్డ్ భూములను రైతులతో కలిసి పరిశీలించారు. పటాన్చెరు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత గూడెం మహిపాల్‌రెడ్డి 117 మంది రైతులకు ఎకరా చొప్పున పొజీషన్ చూపించి ఈ భూముల్లో పట్టాలు ఇప్పించారు. ఈ రైతుల భూములను ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం ఇండ్రస్ట్రియల్ పార్కు పేరుతో రైతుల నుంచి గుంజుకుని టీజీఐఐసీకి అప్పగించాలనే విషయం తెలిసి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రైతులను కలిసి భూములను పరిశీలించారు. గజం భూమిని సర్కారు గుంజుకున్నా ఊరుకోమని రైతులకు భరోసా ఇచ్చా రు. ఇదే జరిగితే రైతుల పక్షాన తెలంగాణ ఉద్యమం తరహాలో రైతుపోరాటం చేస్తామని, రైతుల కోసం నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకైనా సిద్ధమని ఎమ్మె ల్యే రైతులకు భరోసా కల్పించారు. ఈ భూముల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.
కొన్ని నెలల క్రితం గుమ్మడిదల మండలంలోని 109 సర్వేనంబర్‌లోని 157 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ పేరుతో ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం రాష్ట్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రతి రైతుకు ఎకరాకు రూ.29.50 లక్షలు అందజేసినప్పటికీ, రైతుల నివాసాలకు 600 గజాల చొప్పున భూమి ఇవ్వడానికి 5 ఎకరాలు కేటాయించింది. కానీ, ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. టీజీఐఐసీకి భూములు అప్పగించిన సర్కారు, రైతులకు ఇంటిస్థలాల కోసం భూములు ఇవ్వలేదు. మరి కొంత మందికి పరిహారం అందలేదు. అలాగే 30 మంది వరకు పొజిషన్లో ఉన్న పేద రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇక్కడ ఈ పరిస్థితి ఉండగా, మరోసారి 466 ఎకరాలను స్వాధీనం చేసుకోవడాని గెజిట్ విడుదల చేసి తమపై పిడుగుపడ్డట్లు చేసిందని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అన్నారంలోని 261 సర్వేనంబర్ భూములు ప్రభుత్వానికి పెద్ద భూస్వాములు భూ సీలింగ్‌లో ఇచ్చారు. ఇందు లో 117 మంది రైతులకు ఎకరా చొప్పున పటాచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పొజిషన్ చూపించి పట్టాలు ఇప్పించారు. ఈ భూములను అప్పనంగా టీజీఐఐసీకి అప్పగించాలని ప్రభుత్వం చూస్తున్నది. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుంజుకుని రైతులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. దీనిని సహించం. రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం.
– బెంబడి సంజీవరెడ్డి, రైతు, 8వ వార్డు కౌన్సిలర్, అన్నారం (సంగారెడ్డి జిల్లా)
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూముల స్వాధీనానికి మార్చి 13న గెజిట్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం 2013లోని సెక్షన్ 10(ఏ)లోని నిబంధనలకు అనుగుణంగా ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం గెజిట్‌ను విడుదల చేసింది. ప్రాథమికంగా రైతుల అభిప్రాయం తీసుకునే టీజీఐఐసీకి అప్పచెప్పడానికి రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తున్నది. రైతులకు చట్టప్రకారం పరిహారం అందిస్తాం. గతంలో గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ 157 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ స్వాధీనం చేసుకుంది. రైతులకు ఎకరాకు రూ.29.50 లక్షల పరిహారం చెల్లించాం.
-ఎం.పరమేశం, తహసీల్దార్ గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా)
రాష్ట్ర ప్రభుత్వం పేద రైతుల భూములను దోచుకోవడానికి టీజీఐఐసీ పేరుతో ఇష్టారాజ్యంగా భూములు గుంజుకుంటున్నది. ఇది మూమ్మాటికి రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వమే. సీఎం పునరాలోచించి గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి. లేదంటే పెద్దఎత్తున రైతు పోరాటం చేసి హైవేను దిగ్బంధిస్తాం. ఎన్ని కేసు లు పెట్టినా భయపడేది లేదు. రైతులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అండగా ఉంటారు. గెజిట్ ఉపసంహరించే వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం.
– ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా)