పటాన్చెరు, డిసెంబర్ 4: మండలంలోని ఇంద్రేశం గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ సిలిండర్ పేలి వంటిల్లు ధ్వంసమైన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్చెరు అగ్రిమాపక అధికారి జన్యానాయక్, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసిస్తున్న చిన్న మాణిక్యరెడ్డి ఈ మధ్యకాలంలో మృతి చెందాడు. ఆయన దినాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఇంట్లోకి తెచ్చిన సరుకులు, కూరగాయలు, ఇతర కిరాణ సామగ్రిని వంటింట్లో పెట్టారు.
ఆదివారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, గ్యాస్ సిలిండర్ వరకు వ్యాపించాయి. దీంతో సిలిండర్ పేలిపోయింది. పేళుడు తీవ్రతకు వంటిల్లు కూలిపోయింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పటాన్చెరు ఫైర్ ఆఫీసర్ జన్యానాయక్ ఆధ్వర్యంలో ఫైటింగ్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పేళ్లుడు జరిగిన సమయంలో వంటింట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ మేరకు పటాన్చెరు పోలీసులు, ఫైర్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.