ఆ బడిలోని బాలికలు అక్షర సేద్యంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో కలిగే ఎన్నో అనర్థాలపై బడిలో టీచర్ చెప్పిన పాఠాన్ని ఒంట పట్టించుకున్న ఆ బాలికలు, తమ విద్యాలయాన్నే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకొన్నారు. ‘బడితోట’లో భాగంగా సేంద్రియ పద్ధతిలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు.
మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 16 : మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 135 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు వసతి సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్య అందుతున్నది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసించడమే కాకుండా ఆట, పాటలతో పాటు వివిధ పోటీలలో తమ సత్తాను చాటుతున్నారు. రెండేండ్లుగా వంద శాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. ఈ విద్యాలయంలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు పలువురు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు దాతలు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తామని విద్యార్థులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
‘బడితోట’కు శ్రీకారం
ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నది. ఆహారానికి సరిపడా కూరగాయలతో పాటు వంట సామగ్రిని ప్రభుత్వమే పంపిస్తున్నది. తమకు కావాల్సిన పండ్లను కూరగాయలను తామే పండించుకోవాలనే గొప్ప ఆలోచనతో మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఏడాది క్రితం విద్యార్థులు బడితోటకు శ్రీకారం చుట్టారు. విశాలంగా ఉన్న బడి ప్రాంగణాన్నే తమ వ్యవసాయ క్షేత్రంగా మలుచుకున్నారు. సేంద్రియ పద్ధతిలో పండ్లు కూరగాయలను పండించడం మొదలు పెట్టారు. వీరి ప్రయత్నానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించాయి.
పండ్లు, కూరగాయల సేద్యం..
పాఠశాలలో పండ్లు కూరగాయలను విద్యార్థులు పండిస్తున్నారు. హరితహారంలో భాగంగా జామ, ఉసిరి, మామిడి, దానిమ్మ, అల్లనేరేడు తదితర పండ్ల చెట్లను పెంచుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు టీమ్‌లుగా ఏర్పడి గొంగూర, మెంతికూర, బచ్చలకూర, కొత్తిమీర తదితర ఆకుకూరలతో పాటు టమాట, చిక్కుడు, ఉల్లిగడ్డ, దోసకాయ తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈ బడితోటలో మల్లె, తంగేడు, బంతి, మందార, చామంతి, కనకాంబరంతో పాటు గోరింటాకు చెట్లను పెట్టారు.
వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువు తయారీ
పాఠశాలలోని వ్యర్థాలతోనే విద్యార్థులు సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ప్రాంగణంలో రాలిన ఆకులు, చెత్తాచెదారం, తినిపడేసిన అరటి, బత్తాయి వంటి పండ్ల తొక్కలను ఒక్కచోట చేర్చి కంపోస్తు చేస్తున్నారు. అలా తయారు చేసిన ఎరువులను పండ్లు, కూరగాయల చెట్లకు వేస్తున్నారు. క్లాస్‌లు లేని సమయంలో విద్యార్థులు ఎక్కువగా బడితోటలోనే గడుపుతున్నారు. కూరగాయల చెట్ల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను, గడ్డిని విద్యార్థులు ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బడితోటను ఏర్పాటు చేసుకొని సేంద్రియ విధానంలో కూరగాయలను పండిస్తున్న విద్యార్థులను ఇటీవల పాఠశాలను సందర్శించిన నేషనల్ టీమ్ సభ్యులతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలిపేలా పాఠశాల గోడలపై రాసిన నినాదాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.
బడితోట మాకు ఎంతో ఇష్టం
మా పాఠశాలలో ఉన్న బడితోట అంటే ఎంతో ఇష్టం. ఉదయం, సాయంత్రం వేళల్లో బడితోటలోనే గడుపుతున్నాం. మొక్కల చుట్టూ పెరిగిన కలుపు, గడ్డిని ఎప్పటికప్పుడు తీసేస్తున్నాం. మాకు కావాల్సిన కూరగాయలను మేమే పండించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేము ప్రత్యేకంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులనే మొక్కలకు వేస్తున్నాం. ఇండ్ల వద్ద మా అమ్మనాన్నకు కూడా ఇదే పద్ధతిలో ఎరువులు వాడాలని చెబుతున్నాం. పాఠశాలకు వచ్చిన ఆఫీసర్లు అందరూ బడితోటను చూసి మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. – ఎం. చందన, తొమ్మిదో తరగతి
పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
మద్దూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఏడాది క్రితం బడితోటను ప్రారంభించాం. విద్యార్థులకు చక్కటి చదువుతో పాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా బడితోట ద్వారా విద్యార్థులకు తాజా పండ్లు, కూరగాయలు అందుతున్నాయి. కూరగాయల సాగు మాత్రమే కాకుండా పాఠశాలలో హరితహారం కింద వందల సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
– స్వప్న, స్పెషలాఫీసర్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మద్దూరు