పటాన్చెరు రూరల్, జూన్ 29: జలవనరుల పక్కన, బఫర్ జోన్లలో చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి బల్దియా అధికారులు వందలాది ట్రిప్పుల చెత్తను డంప్ చేస్తూ పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగునీరు అందించే మంజీరా నదిని మురికి కూపంగా మార్చేలా చెత్త డంపింగ్ జరుగుతుండడంతో పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత వర్ధిల్లుతున్న ఈ కాలంలో అధికారులు పర్యావరణాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండడంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
చిట్కుల్ గ్రామ పరిధిలో వివిధ కాలనీల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను తెచ్చి గ్రామ శివారులోని నక్కవాగు ఒడ్డున వేస్తున్నారు. బఫర్‌జోన్ మొత్తం చెత్తతో నిండిపోయింది. ఇప్పుడు చెత్త నక్కవాగులో నీటి ప్రవాహానికి అడ్డు పడుతున్నది. కండ్ల ముందే నక్కవాగుకు ఘోరి కడుతుండడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన నక్కవాగును నాశనం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మెడికల్, పారిశ్రామిక వ్యర్థాలను ట్రాలీలలో వేసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు.
అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యర్థాలు నేరుగా నీళ్ల ప్రవాహంతో పాటు ప్రయాణించి మంజీరా నదిని, వాటితో పాటు తాగు, సాగునీటి ప్రాజెక్టులను కలుషితం చేస్తున్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కుల్ గ్రామాన్ని విలీనం చేసిన తర్వాత బల్దియా అధికారులు సేకరించిన చెత్తను నక్కవాగు వద్దకు తరలిస్తున్నారు. చిట్కుల్లో 15 ట్రాలీల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. ఇస్నాపూర్ వైపు సేకరించిన చెత్తను కూడా ఇక్కడికే తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 25 ట్రిప్పుల చెత్తను నక్కవాగు ఒడ్డున పారవేస్తున్నారు. గతంలో చెత్తను మరో డంపింగ్ యార్డుకు తరలించే ప్రతిపాదన చేసిన ఆచరణలోకి తేలేదు.
తడి, పొడి చెత్తను వేరుచేసి అందించాలని ఇంటింటా ప్రచారం చేస్తున్న బల్దియా సిబ్బంది, సేకరించిన చెత్తను మాత్రం ఒకేచోట పారవేస్తున్నారు. తడి,పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువులుగా మార్చడం, ప్లాస్టిక్‌ను పునర్వినియోగించుకోవడంలో ఇస్నాపూర్ బల్దియా విఫలం అవుతున్నది. కేవలం ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడైనా పారవేయడం, బాగా పోగైన తర్వాత నిప్పు పెట్టడం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి తీవ్ర విఘాతం కల్గిస్తున్నది. నిర్ధిష్టమైన విధానం లేకుండా నిర్లక్ష్యంగా చెత్తను తగులబెట్టడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతున్నది.
జలవనరులను చెత్తతో నాశనం చేస్తుండడంతో భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పేలా లేవు. బ్రిడ్జిల వద్ద చెత్త అడ్డంగా నిలిస్తే వరద జనవాసాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. తేలిగ్గా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ నీటి ప్రవాహంలో తేలిగ్గా కొట్టుకొని వెళ్తాయి. ఇలా జలవనరుల పక్కన చెత్తను పారవేయడం మున్సిపాలిటీ సిబ్బందికి, అధికారులకు తప్పుగా, పర్యావరణ సమస్యగా కనిపించక పోవడం విశేషం. చెత్త డంపింగ్‌తో పర్యావరణం దెబ్బతింటున్నా పీసీబీ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. చెత్త నిర్వహణపై నిధులు, విధి విధానం ఖరారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
మంజీరా నది ఉపవాగు నక్కవాగు చెత్తతో నిండిపోతున్నది. చిట్కుల్ నక్కవాగు బఫర్ జోన్లో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధికారులు చెత్తను డంప్ చేస్తున్నారు. బఫర్‌జోన్ నిండిపోయి చెత్త మొత్తం మంజీరా నదిలో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నది. త్వరలో నక్కవాగు పూర్తిగా చెత్తతో నిండిపోయి వాగు ప్రవాహం ప్రశ్నార్థకం కానున్నది. భారీ వర్షాలు కురిస్తే చెత్తతో పాటు ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీబ్యాగులు, నాప్కిన్స్ కొట్టుకొని వెళ్లి మంజీరా నదిలో కలిసే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రవాహం ద్వారా వ్యర్థాలు నిజాంసాగర్, సింగూరు వంటి ప్రాజెక్టుల్లోని జలాలను కలుషితం చేయవచ్చు.