కౌడిపల్లి, జూన్ 30: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెత్త సేకరించడానికి ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి చేతకాక ప్రభుత్వం పక్కకు పెట్టి పల్లెలను గాలికొదిలేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో చెత్తట్రాక్టర్లు నడిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహంచి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో గ్రామాలను తీర్చిదిద్దారన్నారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చారన్నారు.
గ్రామ ప్రజలకు తడి, పొడిచెత్తపై అవగాహక కల్పించి ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారని గుర్తుచేశారు. డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 18 నెలలుగా ట్రాక్టర్లను పక్కకు పడేస్తే ప్రజలు చెత్త ఎక్కడవేయాలో తెలియక మురుగు కాల్వల్లో వేస్తున్నారన్నారు. మురుగు కాల్వలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు సరఫరా చేయించారన్నారు.
ఇప్పుడు మిషన్ భగీరథ పథకాన్ని సర్కారు గాలికొదిలేయడంతో గ్రామాల్లో నీళ్లురాని పరిస్థితి నెలకొందన్నారు. ఆనాడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే నేడు ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ఇండ్లు ఇచ్చినా ఎవరూ నిర్మించుకోవడానికి ముందుకు రావడంలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇచ్చి వారు అనుకూలంగా నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్యాస్ సబ్సిడీ పేరుకే ఉంది ఎవరికీ వస్తలేదన్నారు. గృహజ్యోతి కొంతమందికే వస్తుందన్నారు. నిధులు లేక గ్రామ కార్యదర్శులు అప్పుల పాలయ్యారన్నారు. కార్యదర్శులకు మెమోలు ఇచ్చుడు కాదు పంచాయతీరాజ్ మంత్రికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.