గజ్వేల్, డిసెంబర్ 12 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వెన్నంటి నడిసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమపార్టీతోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు రాష్ట్రసాధనలో కీలకంగా పాలుపంచుకున్నారు. రాజకీయ పార్టీలను చైతన్యం చేయడంలో గజ్వేల్ గడ్డ ఎంతో ముందుంటుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గజ్వేల్ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు మరింత దగ్గరయ్యారు.రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి 2014లో మొదటి సారి ఎన్నికల్లో పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందించారు. గజ్వేల్ ప్రాంతం అన్నింట్లో ముందు వరుసలోనే ఉంది. 2014, 2018లో రెండు సార్లు ముఖ్యమంత్రిని అందించిన ఘనత గజ్వేల్ ప్రజలకు దక్కుతుంది. వరుసగా మూడుసార్లు గజ్వేల్ నుంచి గెలుపొంది కేసీఆర్ హ్యాట్రిక్ సాధించారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకొంది. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో అన్ని మండలాల నుంచి అభ్యర్థులు స్థానిక సంస్థలకు పోటీ చేయగా కొన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కేసీఆర్ పోటీ చేయడంతో ప్రజలు ఆదరించి గెలిపించుకున్నారు. 2014, 2018లో రెండు సార్లు ముఖ్యమంత్రిని అందించిన ఘనత గజ్వేల్కే దక్కుతుంది. 2023లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి గెలుపొంది కేసీఆర్ హ్యాట్రిక్ సాధించారు. 2014 ఎన్నికల్లో 19, 391 ఓట్ల మెజార్టీతో, 2018లో 58,290ఓట్ల మెజార్టీతో, 2023లో 45,031ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరుసగా మూడుసార్లు గెలుపొంది గజ్వేల్‌లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2,74,654 ఓటర్లు ఉండగా 2023లో సాధారణ ఎన్నికల్లో 2,31,086 ఓట్లు పోలవగా కేసీఆర్‌కు 1,11,684 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 66,653ఓట్లు రాగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తూంకుంట నర్సారెడ్డికి డిపాజిట్ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సుమారు20వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మూడు ఈవీఎంలు ఉండడంతో వృద్ధులు గుర్తులను గుర్తించడంలో ఇబ్బందులు పడి స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువగా ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థులకు పడిన ఓట్లలో బీఆర్ఎస్కే పడేవి ఎక్కువగా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండడంతో కేసీఆర్‌కు ఈ సారి మెజార్టీ తగ్గిందని చెప్పొచ్చు. ప్రారంభం నుంచి చివర వరకు ప్రతి రౌండ్లో కేసీఆర్‌కే మెజార్టీ దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూకుంట నర్సారెడ్డికి డిపాజిట్ దక్కకపోవడం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. కొత్త జిల్లాల పునర్విభజనతో గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. దీంతో కొత్తగా మర్కూక్, మనోహరాబాద్ మండలాలు ఏర్పాటు కాగా ప్రజల విజ్ఞప్తి మేరకు 2022లో కుకునూర్పల్లిని మరో మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు కొనసాగారు. తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధిలో గజ్వేల్ రూపురేఖలు మారాయి. పేదల కోసం గజ్వేల్ పట్టణంలో1250 డబుల్ ఇండ్లు, గ్రామాల్లో సుమారు 4వేల డబుల్ ఇండ్లు నిర్మించారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలకు కేసీఆర్ మొదటి ప్రాధాన్యత కల్పించారు. బాలుర, బాలికల కోసం వేరు వేరుగా రూ.146కోట్లతో ఎడ్యుకేషన్ హబ్ నిర్మించి సకల వసతులు కల్పించారు. గజ్వేల్ పట్టణం చుట్టూ 22కిలోమీటర్ల మేర రూ.297కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మాణం, రూ.719.50కోట్లతో 354కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాలతో పాటు పంచాయతీరాజ్ రోడ్లు, గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా రూ.400కోట్లతో మిషన్ భగీరథ ప్లాంట్,కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద రూ.1212కోట్లతో మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం జరిగింది.
గజ్వేల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఒకే చోట అధికారుల కార్యాలయ భవనాల కోసం రూ.42.50కోట్లతో ఐవోసీ భవనం, ప్రతి మండల కేంద్రంలో మండల సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో రూ.57.30కోట్లతో మాతాశిశు ,జనరల్ దవాఖాలను నిర్మించారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులను కలుపుతూ రూ.158కోట్లతో అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ నిర్మా ణం చేపట్టారు. ములుగు రాజీవ్ రహదారి పక్కనే ఆచార్య కొండాలక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అటవీ యూనివర్సిటీలు నిర్మించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. రూ.1762 కోట్లతో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గజ్వేల్‌లో రూ.22.35కోట్లతో వెజ్నాన్ వెజ్ మార్కెట్, రూ.2.47కోట్లతో పత్తి మార్కెట్, ప్రధానంగా ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూసిన రైలు కలను సీఎం కేసీఆర్ నిజం చేసి చూపారు. వేలాది మందికి రైతు బంధు అందుతుంది. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, పంట కల్లాలు, గ్రామ పంచాయతీ, మహిళ, అంగన్వాడీ, పాఠశాల భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాలను తునికి బొల్లారంలో ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వసతులు కల్పించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాల కోసం గజ్వేల్ పట్టణ సమీపంలో 600ఎకరాల విస్తీర్ణంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం అద్భుతంగా చేపట్టారు. కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు.