మెదక్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు, అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత ఏర్పడుతున్నది. మెదక్ కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రోహిత్ అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్‌లతో పాటు జిల్లా అధికారులు, మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల స్వయం, సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మహిళల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.2 వేల పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అదే రూ.2వేల పింఛన్ ఇస్తున్నారని, అది కూడా రెండు నెలలకోసారి వస్తున్నదని.. సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని మహిళలు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఈ పదేండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయా, ఇందులో ఎవరికైనా ఇండ్లు ఇచ్చారా అని అడగగా, మహిళలు మంజూరయ్యాయని సమాధానమిచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతున్నంత సేపు మహిళలు ఎవరికీ వారే ముచ్చట్లు పెట్టుకోవడం కనిపించింది. మంత్రి స్పీచ్‌ను మహిళలు పట్టించుకోలేదు. ఆ తర్వాత మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ, వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులు మంత్రి పంపిణీ చేశారు.