తొగుట : పండుగ పూట వంటలు చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి అగ్రి ప్రమాదం జరిగి ఆస్తి నష్టం సంభవించింది. తొగుట మండలంలోని చందాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బెజగామ నర్సయ్య ఇంట్లో ఉదయం 10.30 సమయంలో పండుగ సందర్బంగా వంట పనులు చేస్తుండగా ఒక్కసారి గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో ఉన్న వారు బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.
ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. మంటల్లో ఫ్రిడ్జి, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి కాలిపోయింది. లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు నర్సయ్య కోరాడు. విషయం తెలుసుకున్న ఆర్ఐ అశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జనగామ సుభాష్ గౌడ్‌తో కలిసి బాధితులను పరామర్శించారు. రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మాజీ సర్పంచ్ నర్సట్టి మల్లేశం, నాయకులు చెందికుమార్, రవి, ధర్మయ్య, కర్ణాకర్, మహేష్, నరేందర్, స్వామి, చంద స్వామి, నర్సింలు, ఎల్లయ్య తదితరులు ఉన్నారు.