Zubeen garg | అస్సామీ ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్‌లో ఓ బోట్ ట్రిప్ సమయంలో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. సెప్టెంబర్ 19న జరిగిన 20వ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం జుబీన్ సింగపూర్ వెళ్లారు. అయితే అక్కడ అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. మరోవైపు కొత్త ఆరోపణలతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జుబీన్ గార్గ్ స్కూబా డైవింగ్ సమయంలో చనిపోయారని సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా వచ్చిన వివరాల ప్రకారం, ఆయన స్విమ్మింగ్ గేర్ లేకుండానే సముద్రంలోకి వెళ్లి, అక్కడే మునిగి మరణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎలాంటి నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
జుబీన్ గార్గ్ మృతి కేసు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జుబీన్ మేనేజర్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి మరియు సహ గాయనీ అమృతప్రభ మహంతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ జుబీన్ మృతిచెందిన సమయంలో ఆయనతో సముద్రంలో ఉన్నారు. గోస్వామి సమీపంలో ఈత కొడుతూ కనిపించగా, మహంత తన సెల్ఫోన్లో ఆ ఘటనను వీడియో తీయడం నిర్ధారించబడింది. ఈ ఆధారాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, జుబీన్ భార్య గరిమ గార్గ్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మరింత కీలకంగా మారాయి. “నా భర్త ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడ వెళ్లాక అతనిపై బాధ్యతా రహితంగా వ్యవహరించారు,” అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జుబీన్‌కు గుండె జబ్బు లేనప్పటికీ, ప్రయాణంలో తీవ్ర అలసటకు గురయ్యారని తెలిపారు. “చనిపోవడానికి ముందు జుబీన్ నాతో ఫోన్లో మాట్లాడాడు. ఆ సమయంలో పిక్నిక్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఆయననని అక్కడికి తెలియకుండా తీసుకెళ్లి ఉండవచ్చు అంటూ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా, జుబీన్ నిత్యం మందులు వాడే వారు. కానీ, ఆ రోజు ఆయనకు మందులు ఇచ్చారా? లేదో తనకు తెలియదని చెప్పారు. సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇవ్వమని అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా స్కూబా డైవింగ్ వల్ల జరిగిన మృతి కాదు. దీనిలో పెద్ద కుట్ర ఉందని నా అనుమానం. నా భర్తను బలవంతంగా తీసుకెళ్లి చంపేశారు.. న్యాయ వ్యవస్థపై నాకెప్పటికీ నమ్మకం ఉంది. నాకు త్వరలోనే న్యాయం జరగుతుంది,” అని గరిమ గార్గ్ అన్నారు.