Hunger | జీర్ణ సమస్యలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. వాటల్లో ఆకలి లేకపోవడం అనే సమస్య కూడా ఒకటి. దీన్నే అనోరెక్సియా అంటారు. ఆకలి లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరికి ఈ సమస్య కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా ఉంటుంది. తరువాత దానంతట అదే మాయమైపోతుంది. మళ్లీ ఎప్పటిలా ఆకలి వేస్తుంది. ఇక కొందరికి ఎల్లప్పుడూ ఈ సమస్య ఉంటుంది. ఏం తిందామన్నా తినబుద్ధి కావడం లేదని, అసలు ఆకలి కావడం లేదని అంటుంటారు. అయితే ఎవరికైనా సరే ఇలా గనక ఉంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని, వారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. కనుక దానికి తగినట్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆకలి లేకపోవడం అనే సమస్య కూడా తగ్గుతుంది.
ఎవరికైనా ఆకలి సరిగ్గా అవడం లేదు అంటే అందుకు పలు కారణాలు ఉంటాయి. మందులను దీర్ఘకాలికంగా ఉపయోగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చెందిన మందులను వాడడం లేదా జీర్ణ సమస్యలు, లివర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులకు మెడిసిన్లను ఉపయోగించడం, హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ ఉండడం, డయాబెటిస్ బారిన పడిన వారికి, గర్భిణీలకు ఆకలి సరిగ్గా ఉండదు. యాంటీ బయోటిక్స్, కీమోథెరపీ మందులు, యాంటీ డిప్రెసెంట్స్, పెయిన్ కిల్లర్స్‌ను అధికంగా వాడే వారికి కూడా ఆకలి అనిపించదు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఆకలి అవదు. వయస్సు మీద పడడం వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. మెటబాలిజం మందగించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఆకలి లేని వారు రోజూ భోజనానికి ముందు రెండు పూటలా ఒక టీస్పూన్ అల్లం రసాన్ని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని కూడా నమిలి తినవచ్చు. దీని వల్ల వికారం తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది. ఇతర జీర్ణ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. రోజూ రాత్రి పూట భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను పొడిగా చేసి అందులో కాస్త మిరియాల పొడి కలిపి చప్పరిస్తుండాలి. దీని వల్ల కూడా ఆకలి సరిగ్గా అవుతుంది. ఆకలిని పెంచడంలో వాము గింజలు కూడా ఎంతగానో పనిచేస్తాయి. వాము గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా కొద్దిగా వామును తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తిని వెంటనే ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది.
భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నా కూడా ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. రోజుకు 3 పూటలా అతిగా ఆహారం తినే కన్నా 4 నుంచి 5 సార్లు తక్కువ మొత్తంలో ఆహారం తినాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఆకలి సక్రమంగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత వెంటనే కూర్చుని పనిచేయకుండా 10 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేస్తుంటే ఫలితం ఉంటుంది. ఆహారం తినే సమయంలో ఫోన్లు, టీవీలు చూడకుండా తినాలి. దీని వల్ల ఆహారంపై ఆసక్తి పెరిగి ఆకలి అవుతుంది. పెరుగు, చియా విత్తనాలు, అవకాడో, వెజిటబుల్ లేదా చికెన్ సూప్, పీనట్ బటర్, చీజ్, కోడిగుడ్లు, ఓట్ మీల్, ఆలివ్ ఆయిల్, విత్తనాలు, నట్స్, తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తింటుంటే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆకలి కావడం లేదు అన్న సమస్య ఉండదు.