దుబ్బాక, మే 13: పర్యావరణ పరిరక్షణతో పాటు మన ఆరోగ్యం-మన చేతుల్లోనే .. అనే నినాదంతో దుబ్బాక శివారులో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్‌కు ఆదరణ లేకుండాపోయింది. ఐదు నెలల కిందట ఎఫ్ఎస్టీపీ ప్లాంట్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించారు. ఆశించిన రీతిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాలు రావడం లేదు. దీంతో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కోసం నిర్మించిన కేంద్రం ఆదరణకు నోచుకోక వెలవెలబోతుంది.
రూ.73 లక్షలతో నిర్మాణం
బీఆర్ఎస్ హయాంలో పట్టణాలు, పల్లెల పచ్చదనం, అభివృద్ధిలో పరుగులు పెట్టాయి. తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి మార్గాలుగా నిలిచాయి. స్వచ్ఛత పెంపొందించేందుకు పట్టణాల్లో ఎఫ్ఎస్టీపీల ఏర్పాటుకు ప్రోత్సహించింది. మానవ ఘన వ్యర్థాలను ఎరువుగా మార్చి పంటలకు వినియోగించడం ఎఫ్ఎస్టీపీ ముఖ్య ఉద్దేశం. దుబ్బాక శివారులో దుబ్బాక-హబ్షీపూర్ రోడ్డు సమీపంలో ఎఫ్ఎస్టీపీని నిర్మించారు.
పట్టణ ప్రగతి నిధులు రూ.73 లక్షలతో ఎకరా స్థలంలో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని (ఎఫ్ఎస్టీపీ)నిర్మించారు. దుబ్బాక మున్సిపాలిటీతోపాటు పక్క గ్రామాలకు చెందిన సెప్టిక్ ట్యాంకుల్లో సేకరించిన వ్యర్థాలను ఇక్కడ డంప్ చేసే అవకాశం ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఎఫ్ఎస్టీపీ వినియోగానికి నోచుకోలేకపోతున్నది. ఐదు నెలల్లో సెప్టిక్ ట్యాంకర్ల నిర్వాహకులతో మున్సిపల్ అధికారులు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. మరోపక్క మానవ ఘన వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తూ.. శివారు ప్రాంతాల్లో చెరువు, కుంటల్లో వదిలేయడంతో దుర్గంధంతో పాటు పలు అనారోగ్యకర సమస్యలు నెలకొంటున్నాయి. పర్యావరణం కలుషితం కావడంతో జీవరాశులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ఆరు రకాల యంత్రాలు
దుబ్బాకలో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్లాంట్‌లో నాలుగు గదుల నిర్మాణంతో పాటు ఘన వ్యర్థాల శుద్ధీకరణకు సంబంధించిన ఆరు రకాల యంత్రాలు బిగించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్, క్లారిఫైయర్, ఎయిర్ బ్లోయర్, థర్మల్ ప్రాసెసింగ్ మీటర్లు, కన్వేయర్ మోటర్లు, స్లడ్జ్ స్క్రూ కన్వేయర్ యంత్రాలు ఏర్పాటు చేశారు. నీటి వ్యర్థాల నిల్వకు మూతలతో కూడిన సంపులను నిర్మించారు. రోజుకు 10వేల లీటర్ల ఘన వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఐదు నెలల్లో 2 వేల లీటర్ల వ్యర్థాలు శుద్ధీ చేయలేకపోవడం గమనార్హం. లక్షలు వెచ్చించి నిర్మించిన ఎఫ్ఎస్టీపీ అలంకారంగా మారడంతో పలు విమర్శలకు దారితీస్తుంది.
అవగాహన కల్పిస్తాం..
ఎఫ్ఎస్టీపీ కేంద్రం వినియోగంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దుబ్బాక పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో గోడలపై కేంద్రం ప్రాముఖ్యత, వినియోగం టోల్‌ఫ్రీ నంబర్ 14420 తెలిపే చిత్రాలను ఏర్పాటు చేసి మరింత ప్రచారం చేస్తాం. సెప్టిక్ క్లీనింగ్ వాహనాలు ఇక్కడికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– ఎం.శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్ కమిషనర్