గజ్వేల్, ఏప్రిల్ 29: బ్రిటన్ పార్లమెంట్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని ఫామ్ స్టే రిసార్ట్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సైనికులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోగినపల్లి సంతోష్‌రావు మాట్లాడుతూ.. హరితసేనకు దక్కిన గౌరవం మీ అందరిదని, మొక్కలు నాటి సంరక్షించిన ప్రతి చేయికి ఈ అవార్డు అంకితమన్నారు. అందరి కృషి ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, మంచి ఫలితాలు వచ్చేలా ముందుకు సాగాలని సూచించారని, ఈ నా ఆశయం, ఆశ జీవితాంతం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ మంచి కార్యక్రమంలో రాబోయే తరాలు పాల్గొనేలా కృషిచేయాలని హరితసైనికులకు సూచించారు. ఈ రోజు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు జన్మదినం,ప్రత్యేక రోజుల్లో మొక్కలు నాటేలా అవగాహన కల్పించామన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా మొక్కలు నాటాలనే ఆలోచన ప్రజాప్రతినిధుల్లో వచ్చిందన్నారు. త్వరలోనే కమాండ్ వెబ్స్ లోగో రాబోతుందని, ఇది ఎంతో గౌరవమైన విషయమన్నారు. దీంతో మాపై న మరింతగా బాధ్యత పెరిగిందని భావిస్తున్నామన్నారు. కల్మషం లేకుండా ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి వియజవంతంగా ముందుకు సాగేలా అందరు కృషి చేయాలని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.
ప్రకృతిని కాపాడడం, అడవుల సంరక్షణతో మానవాళికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో హరితహారంకు స్ఫూర్తిగా గ్రీన్ ఇండియాలో భాగంగా మిలియన్ మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే పుట్టినరోజున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా అవగాహన కల్పించడం మంచి సంప్రదాయం అన్నారు. ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమంలో నూతన ఒరవడిని తీసుకొచ్చారని, ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఈ కార్యక్రమం ఆకర్షిస్తుందన్నారు.
సమాజానికి మంచి స్ఫూర్తినిచ్చేలా కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు హరితహారంతో పచ్చదనంతో అడవుల విస్తీర్ణం పెంచారని గుర్తుచేశారు. ఈ కార్యమ్రమంలో అందరినీ భాగస్వాములు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, హరితసేన రాష్ట్ర నాయకులు రాఘవేందర్‌యాదవ్, కరుణాకర్‌రెడ్డి, చెప్యాల రాజేశ్వర్‌రావు, సతీశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గౌరీశంకర్, రవి, బాల్‌రాజు, రజినీ సాయిచంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి, జుబేర్, లింగారెడ్డి పాల్గొన్నారు.