మెదక్ మున్సిపాలిటీ : మెదక్ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోరా అని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు అంజనేయులు, శ్రీనివాస్, మల్లేశం, జయరాజ్, విశ్వం, కిషోర్, బీఆర్ఎస్ నేతలు జుబేర్ అహ్మద్, జగదీష్, వేణు తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జిల్లా ఆదనపు కలెక్టర్ నగెష్కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. భగిరథ నీటి సరఫరా అయ్యే పైపులైన్లో అంతరాయం ఏర్పడితే మున్సిపల్ అధికారులు మరమ్మత్తులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై ప్రస్తుత ప్రభుత్వంలో పర్యవేక్షణ కరువైందన్నారు. భగీరథకు సంబంధించి గ్రిడ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పైపులైన్ మరమ్మత్తులు నాలుగు రోజులుగా కొనసాగడంలో అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు.
కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా ప్రజలకు నీళ్లు అందించకలేకపోతున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. శనివారంలోగా మరమ్మత్తులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు నీరందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.