సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అవగాహన లేకుండా అన్ని చేస్తాం అని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెయ్యకపోవడం దారుణమన్నారు. వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా రిక్రూట్మెంట్ చేస్తే విధిగా వేయిటేజ్ కల్పించాలన్నారు.
అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నందున వేయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గులాబీ అధినేత కేసీఆర్ కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని చెప్పినా ఉన్న పెన్షన్ను సక్రమంగా ఇచ్చే పరిస్థితిలేదన్నారు. అలాంటి హామీలు అనేకం అనాలోచితంగా రేవంత్రెడ్డి ఇచ్చారని, కానీ అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.