నారాయణఖేడ్, జనవరి 5: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి రైతులను మరోసారి మోసం చేసిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నదన్నారు. రైతు భరోసా పథకంపై అధ్యయనం చేసేందుకు కమిటీ పేరిట కాలయాపన చేసిన ప్రభుత్వం, త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతుభరోసాపై అనాలోచితంగా ప్రకటన చేసిందన్నారు.
సాగుచేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్న నిబంధనలతో వర్షాధార పంటలను పండించే నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లోని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకం అమలు చేసే విషయంలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు తాను నారాయణఖేడ్ పరిస్థితిని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో ఆ నిబంధనను మినహాయించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రాంత రైతులపై చిత్తశుద్ధి ఉంటే జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి సీఎంతో చర్చించి సాగు భూముల నిబంధన లేకుండా చేయాలన్నారు. భూమిలేని రైతు కూలీలకు మాత్రమే రూ.12 వేలు ఇస్తామంటున్న ప్రభుత్వం తీరు సరికాదన్నారు.
ఈ లెక్కన గుంటల్లో భూములు ఉన్న వారు నష్టపోతారని, జాబ్‌కార్డు ఉండి ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీలందరికీ రూ.12 వేలను వర్తింపజేయాలని సూచించారు. ఇక్కడి రైతులు బాగుపడాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో పాటు ఎనిమిది చెరువుల నిర్మాణ పనులు కొనసాగించాలన్నారు. రుణమాఫీ, పంటలకు బోనస్ విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేసిందనే విమర్శించారు. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ కనెక్షన్ విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం చూపిన ఉదారతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చూపడం లేదని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.