నారాయణఖేడ్, జూలై 19: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ ఇటీవల సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతోనైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధితెచ్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి హితవు పలికారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయకపోవడం కారణంగానే తండాలకు ఈ దుస్థితి వచ్చిందని హుస్సేన్‌నాయక్ మాటలతోనైనా కాంగ్రెస్ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచి పేదలకు పంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయించుకుని ఇప్పుడు బీఆర్ఎస్పై నిందలు వేయడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి కేవలం పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసి చూపించామన్నారు.
ప్రభుత్వ పెద్దలతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచితం విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ.36.80 కోట్లు మంజూరు చేసి 16.80 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. రూ.110 కోట్లతో దాదాపు అన్ని తండాలకు రోడ్లు వేశామని, గైరాన్తండాకు సైతం వంతెన, రోడ్డు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎమ్మెల్యే మాత్రం తాను మంజూరు చేయించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మిషన్ భగీరథ ద్వారా మారుమూల తండాలకు నీటి సరఫరా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెబుతున్న ఎమ్మెల్యే ఏ తండాలో మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని,ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒక దవాఖాన మంజూరు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, మండల అధ్యక్షుడు నగేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ఎంఏ.నజీబ్, ఆహీర్ పరశురామ్, ముజామిల్, రాజునాయక్, వెంకటేశం, మల్గొండ, సంజీవ్ పాల్గొన్నారు.