సిద్దిపేట, మే 11: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, హనుమాన్ దీక్ష స్వీకరించడం.. శ్రీరామ నామ జపంతో అంతా మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హనుమాన్ మాలధారుల భజన, పూజా కార్యక్రమంలో హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. హనుమాన్ స్వాములు ఇంత పెద్దఎత్తున ఇక్కడికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్ల తెలిపారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠనం, శ్రీరామ నామ జపం ఎంతో బలాన్ని ఇస్తుందన్నారు. హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున స్వాములు వచ్చి భజన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సిద్దిపేటలో 40 ఏండ్ల క్రితం హనుమాన్ దీక్షాకు బీజం పడిందని, నాడు స్వామీజీ ఆధ్వర్యంలో ఐదుగురితో సిద్దిపేటలో మొదలైన ఈ దీక్ష ఇప్పుడు లక్షలాది మంది స్వీకరించేలా చేసిందని చెప్పారు. సిద్దిపేటలో ఆరంభించిన ఏ కార్యమైనా సిద్ధ్దిస్తుందని, సిద్దిపేట మట్టిలోనే ఆధ్యాత్మిక.. ధార్మిక బలం ఉందన్నారు. ఆపరేషన్ సిందూరం విజయవంతం కావాలని అనేకమంది ఆలయాల్లో పూజలు నిర్వహించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
నేడు హనుమాన్ మాల ఎల్లలు దాటిందని హనుమాన్ దీక్షా పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామీజీ అన్నారు. సిద్దిపేటలో తకువ సంఖ్యలో మొదలైన హనుమాన్ దీక్ష ఎన్నో లక్షలాది మందికి సూచిక అయ్యిందన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు నాయకులు ఉండడం వల్లనే నిత్యం నీళ్లు, కరెంట్, అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్‌రావు అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు భజనలో పాల్గొన్న స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి తాంబూలాన్ని అందజేశారు.