రామచంద్రాపురం, ఏప్రిల్ 26: బండెనక బండికట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు సాయిచరణ్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించారు.
బీఆర్ఎస్ గుర్తు అంబాసిడర్ కార్లను తెప్పించి వాటికి బీఆర్ఎస్ స్టిక్కర్స్‌తో గులాబీ రంగుగా మార్చేశారు. వరంగల్ సభ కోసం 18అంబాసిడర్ కార్లను తెచ్చి వాటిని ఆకర్ష్షణీయంగా తయారు చేయించారు. ఈ కార్లను శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నుంచే ఆ కార్లు వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి బయలుదేరాయి.
బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం వినూత్నంగా ఆలోచించి పార్టీ గుర్తయిన అంబాసిడర్ కార్లను ఆకర్షణీయంగా ముస్తాబు చేయించినందుకు బీఆర్ఎస్ యువ నాయకుడు సాయిచరణ్గౌడ్ని హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. హరీశ్‌రావు ఈ కార్లను ప్రారంభించిన అనంతరం బండెనక బండి కట్టి..
18బండ్లు కట్టి అన్నట్లు ఒకే లైన్లో అంబాసిడర్ కార్లు వెళ్తుంటే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంబాసిడర్ కార్ల వీడియోలు సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్‌లో హల్చల్ చేస్తున్నాయి. కార్యక్రమంలో పటాన్చెరు ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, నాయకులు సోమిరెడ్డి, రాములుగౌడ్, అంజయ్య, బాల్‌రెడ్డి, శ్రీధర్‌చారి, పృథ్వీ, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.