సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 5: కల్యాణలక్ష్మి లబ్ధిదారుల కోసం మొదటిసారి జీవితంలో హైకోర్టు మెట్లు ఎక్కానని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 484 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా రోజులుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం పెండింగ్‌లో ఉదని, చెక్కులు పంచుదామంటే ప్రభుత్వ పెద్దలు సహకరించడం లేదని, హైకోర్టులో కేసు వేసి ఆర్డర్ తీసుకొచ్చి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడ పిల్లలకు సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారన్నారు. మొదటగా రూ.50 వేలతో ప్రారంభమై.. ప్రస్తుతం రూ.లక్షా పదహారు వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెక్కుతోపాటు తులం బంగారం కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ పథకాన్ని ప్రా రంభించాలన్నారు. పాలు ఏవో, నీళ్లు ఏవో ప్రజలకు ఇప్పుడు తెలుస్తుందన్నారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చి చెక్కులు పంచే పరిస్థితి వచ్చిందన్నారు. పేదలకు కేసీఆర్, న్యూట్రీషన్ కిట్లు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కడుపునిండా భోజనం పెట్టి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసే పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిర్బంధాలు, పోలీసు పహారాలో చెక్కులు పంచాల్సిన పరిస్థితి వచ్చింది. గురువారం విపంచి కళానిలయంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పం పిణీ కార్యక్రమం చూస్తే పరిస్థితి అలాగే కనబడింది. ఎన్నడూ లేనిది సిద్దిపేటలో ఎటుచూసినా పదుల సంఖ్యలో పోలీసులు కనబడుతున్నారని, గతంలో ఇలా ఎప్పు డూ జరగలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులను, లబ్ధిదారుల కుటుంబసభ్యులను సైతం పోలీసులు లోనికి అనుమతించ లేదు. దీంతో కార్యక్రమం ముగిసే వరకు ప్రతిఒక్కరూ రోడ్డుపైనే నిలుచున్నారు.