హుస్నాబాద్, డిసెంబర్ 4: హుస్నాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో ఒరిగిందేమీ లేదని, కేవలం సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని సభ నిర్వహించారే తప్ప అభివృద్ధి కోసం కాదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. పాత నిధులకే శంకుస్థాపనలు చేసి ఎంతో ఇచ్చినం అని చెప్పుకోవడం, దీనికి కాంగ్రెస్ నాయకులు ఆహా..ఓహో అనడం తప్పా, ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే పనేమీ జరగేలేదని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో సభ పెట్టి కరీంనగర్ జిల్లా పాటపాడిన సీఎం, మంత్రులు సిద్దిపేట జిల్లాకు ఏంచేస్తున్నారో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి సభలు నిర్వహించడం, గ్రామాల నుంచి జనాన్ని తరలించడం, శంకుస్థాపనలు చేసి ప్రలోభాలకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు. సీఎం సర్పంచ్ అభ్యర్థులను పరోక్షంగా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర ద్వారా వచ్చి గండిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించి గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్‌ను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం, తట్టెడు మట్టికూడా తీయలేకపోయాడని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే 96శాతం రిజర్వార్ పూర్తి చేసి భారీ మోటర్ల ద్వారా టీఎంసీ నీళ్లు నింపిందెవరో తెలియదా అని ప్రశ్నించారు. గెలిచిన కొత్తలో రూ.437కోట్ల నిధులు తెచ్చానని చెప్పి ఒక కోటి కూడా ఖర్చు చేయలేదన్నారు. పొట్లపల్లి దేవునిపై ఒట్టు వేసి బాండ్ రాసిచ్చిన మంత్రి పొన్నం ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట్లాడాలని హితవు పలికారు. నియోజకవర్గంలో చిన్ననీటి వనరులను అభివృద్ధ్ది చేసి సాగునీటి సౌకర్యాన్ని పెంచింది బీఆర్ఎస్ హయాంలోనే అనేది గుర్తుంచుకోవాలన్నారు.
ప్రభుత్వ భవనాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించినవే..
ఎన్నికలకు ముందు గౌరవెల్లి నిర్వాసితులను రెచ్చగొట్టి రూ.30లక్షల పరిహారం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పుడు రూ.15లక్షల కంటే ఎక్కువ రాదని చెప్పడం సిగ్గుచేటు కాదా అన్నారు. ఐవోసీ భవనం సహా ప్రభుత్వ భవనాలన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవేనని గుర్తుచేశారు. దవాఖాన భవనం కూల్చివేసి కమీషన్ల కోసమే కొత్త భవనం కడుతున్నారని ఆరోపించారు. ఎల్లమ్మ చెరువు సందరీకరణ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే మంత్రి పొన్నం తన క్యాంపు ఆఫీస్‌కు బారికేడ్లు ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రిగా హుస్నాబాద్‌కు తెచ్చింది, పూర్తి చేసి ప్రారంభించిన పని ఏదైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తొమ్మిదిన్నరేండ్లు నిస్వార్థంగా ప్రజలకు సేవలందించిన ఘనత తమదేనని, కేవలం స్వార్థం కోసం నిధులు తెస్తున్న ఘనత మీదని వొడితెల సతీశ్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.5,649కోట్ల అభివృద్ధి, రూ.3,427కోట్ల సంక్షేమాన్ని అమలు చేసి చూపించామని వివరించారు. దమ్ముంటే హుస్నాబాద్ సీఎం సభ సందర్భంగా శంకుస్థాపన చేసిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి చూపించాలని, లేకుంటే పొన్నం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప పనులు గడప దాటడం లేదని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు బీలూనాయక్, భూక్య మంగ, మాజీ ఎంపీపీలు లక్ష్మీ, మానస, నాయకులు వెంకట్రాంరెడ్డి, గూల్ల రాజు, తిరుపతిరెడ్డి, పూదరి రవీందర్, ప్రభాకర్‌రెడ్డి, బండి పుష్ప, వాల సుప్రజ, కొంకటి నళినీదేవి, ఇంద్రాల సారయ్య, స్వరూప, హరీశ్, బోజు రవి, వికాస్, భూపతిరెడ్డి, రాజునాయక్, నారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.