గజ్వేల్, డిసెంబర్ 5: రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు మార్కెట్ ధర నిర్ణయించి పరిహారం చెల్లించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతులు ఆయన్ని కలిసిన సందర్భంగా మాట్లాడారు. న్యాయపరమైన పరిహారం దక్కేవరకు బీఆర్ఎస్ మీ వెంటే ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి ట్రిపుల్ఆర్ బాధితులకు మార్కెట్ ధర ప్రకారం పరిహా రం చెల్లిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు.
రైతులను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అధికారులు, పోలీసులతో బెదిరిస్తూ భూములు లాక్కుంటామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్ఆర్ఆర్ మారుస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. ఎకరాకు ఏడునుంచి ఎనిమిది లక్షలు ఇస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మాసాయిపేట, తూప్రాన్, వర్గల్, గజ్వేల్, మార్కుక్, జగదేవ్‌పూర్ మం డలాల్లోని ఆయా గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్తుండటంతో రైతులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, విరాసత్ అలీ, చంద్రశేఖర్, సాయిలు, హన్మంతరెడ్డి, బాలమల్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.